
పిల్లలతో రాజు, రాజమణి దంపతులు (ఫైల్)
వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. అప్పటికీ అక్కడున్న కాపలాదారు వద్దన్నాడు..
► బతుకమ్మ పండక్కి వెళ్తూ బతుకు కోల్పోయిన తల్లీబిడ్డలు
► వాగులో కొట్టుకుపోయి తల్లితోపాటు ఐదుగురు చిన్నారుల మృతి
► పిల్లలంతా ఆడబిడ్డలే.. వారిలో ఇద్దరు కవలలు.. ఓ 13 నెలల పసిగుడ్డు
► నిజామాబాద్ జిల్లాలో విషాదం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/కంగ్టి: వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. అప్పటికీ అక్కడున్న కాపలాదారు వద్దన్నాడు.. కారు డ్రైవర్ వినలేదు.. అలాగే ముందుకుపోనిచ్చాడు.. మధ్యలోకి వెళ్లాక కారు ఆగింది.. ముందుకు నెట్టేందుకు డ్రైవ ర్, మరొకరు దిగారు.. ఇంతలో నీటి వేగానికి కారు కొట్టుకుపోయింది.. చూస్తుండగానే ఆ కారులోని తల్లి, ఆమె ఐదుగురు పిల్లలు జల సమాధి అయ్యారు!
బతుకునిచ్చే బతుకమ్మ పండుగ కోసం ఆడబిడ్డ సంబరంగా తల్లిగారింటికి వెళ్తుండ గా జరిగిన ఈ ఘోర దుర్ఘటన అందరినీ కలచివేసింది. తల్లితోపాటు ఐదుగురు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగామ్‌లో చోటుచేసుకుంది.
ఎలా జరిగింది?
మెదక్ జిల్లా కంగ్టి మండలం తడకల్ గ్రామానికి చెందిన మాలజంగం రాజు, రాజమణి దంపతులకు ఐదుగురు పిల్లలు. రాజు విద్యుత్ శాఖలో లైన్ మన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజమణి తల్లిగారి ఊరు నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం అన్నారం. బతుకమ్మ పండుగ నేపథ్యంలో రాజమణిని ఆమె సోదరుడు నవీన్ అన్నారం తీసుకువెళ్లేందుకు వచ్చాడు. శనివారం రాజమణి (29), ఆమె కూతుళ్లు శ్రీయ(7), జ్యోతి(4), జ్ఞాన హస్మిత(3), జ్ఞాన సమిత(3) (వీరిద్దరు కవలలు) దీపాంక్ష (13 నెలలు), నవీన్ కలసి కారులో బయల్దేరారు. కొద్దిరోజుల కిందట చిన్న పాప దీపాంక్షపై వేడి టీ పడడంతో శరీరం కాలింది.
అప్పుడే తడకల్‌లోని స్థానిక ఆసుపత్రిలో చూపించి చికిత్స అందించారు. శనివారం అన్నారం వెళ్తుండగా దారి మధ్యలో పిట్లంలో పాపను మరోసారి డాక్టర్‌కు చూపించాలని భావించారు. కారు కారేగామ్ వద్దకు వచ్చింది. అక్కడ పిల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కారు వెళ్లడానికి వీలు కాదంటూ వాగు వద్ద కాపలాదారు వారిని వారించాడు. అయినా కారు డ్రైవర్ ఇస్మాయిల్ వినకుండా ముందుకుపోనిచ్చాడు. వాగు మధ్యలోకి వెళ్లిన తర్వాత కారు ఆగిపోయింది. కారులోనుంచి ఇస్మాయిల్, నవీన్ బయటకు వచ్చారు. కారును ముందుకునెట్టే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఒక్కసారిగా వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది.
కారులో ఉన్న రాజమణి, ఆమె ఐదుగురు పిల్లలు వాగులో కొట్టుకుపోయి మరణించారు. ఘటన తెలుసుకున్న పిట్లం, కంగ్టి పోలీసులు వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. వర్షం కురుస్తున్నా తాళ్ల సాయంతో వాగులోకి దిగి కారు ఆచూకీని గుర్తించి బయటకు తీశారు. కారు నుంచి తల్లితో సహా ఐదుగురు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఇస్మాయిల్ మద్యం సేవించి కారు నడుపుతున్నాడని స్థానికులు, రాజమణి తమ్ముడు నవీన్ తెలిపారు.
సీఎం సంతాపం
కారేగామ్‌లో జరిగిన ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
పిల్లల్లేని ఇంట్లో నేనెలా ఉండాలి
‘‘పిల్లలను ఎంతో గారాబంగా పెంచుతున్నా.. వారి కోసమే కారు కొన్నా.. అదే కారు పిల్లలతోపాటు నా భార్యను మృత్యు ఒడిలోకి లాక్కెళ్లింది..’’ అంటూ జంగం రాజు రోదించారు. పిల్లల్లేని ఇంట్లోకి ఇక ఎలా వెళ్లాలంటూ విలపించారు.