
చెత్త కుప్పలో లభ్యమైన మరకతలింగం
తిరువణ్ణామలై: వేట్టవలంలోని మనోర్‌మణి అమ్మల్ ఆలయంలో రెండేళ్ల క్రితం చోరీకి గురైన మరకతలింగం చెత్త కుప్పలో లభ్యమైన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా వేట్టవలంలోని జమీన్ కోట కొండపై శ్రీమనోర్‌మణి అమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో రూ.5 కోట్ల విలువైన మరకతలింగం, అమ్మన్ వెండి కిరీటం(కిలో), వెండి పాదం, వడ్డానం, మరకతలింగం పెట్టేందుకు ఉపయోగించే వెండి నాగభరణం, నాలుగు గ్రాముల బంగారు తాళిబొట్టు 2017లో చోరీకి గురయ్యాయి. దీనిపై వెట్టవలం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి అడిషనల్ ఎస్పీ రంగరాజన్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.
విచారణలో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో విగ్రహాల చోరీ నియంత్రణ విభాగానికి కేసును మార్పుచేశారు. దీంతో అడిషనల్ ఎస్పీ మాధవన్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వేట్టవలం జమీన్‌కోట వద్ద ఉన్న ఓ చెత్త కుప్పలో చోరీకి గురైన మరకతలింగం ఉండడంతో గుర్తించిన కార్మికుడు పచ్చయప్పన్ పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు అక్కడికి వచ్చి విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాత ఫొటోలతో పరిశీలించిన తర్వాత ఆలయ అర్చకుడు, జమీన్ మహేంద్రన్‌ను రప్పించారు. వారు రెండేళ్ల క్రితం చోరీకి గురైన మరకతలింగంగా గుర్తించారు. వెంటనే విగ్రహాల నియంత్రణ విభాగం ఐజీ పొన్ మాణిక్యవేల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వేట్టవలం చేరుకొని జమీన్ కోట వద్ద ఉన్న చెత్త కుప్ప, ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.