‘మురసొలి’తో పాత్రికేయుడిగా.. | Karunanidhi Articles with Cheran By Line | Sakshi
Sakshi News home page

‘మురసొలి’తో పాత్రికేయుడిగా..

Aug 8 2018 2:51 AM | Updated on Oct 9 2018 6:36 PM

Karunanidhi Articles with Cheran By Line - Sakshi

సాక్షి, చెన్నై: దక్షిణామూర్తి అలియాస్‌ ముత్తువేలర్‌ కరుణానిధి అన్ని రంగాల్లోనూ ఆరితేరిన వారే. మీడియా రంగంలో ఆయన అరంగేట్రం మురసొలితో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలం లో 18 ఏళ్ల వయసులో ఆయన కలం చేబట్టారు. స్వస్థలం తిరువారూర్‌ వేదికగా 1942 ఆగస్టు 10 నుంచి ‘మురసొలి’పేరుతో కరపత్రాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఇందులో వ్యాసాలు, సమాచారాన్ని ‘చేరన్‌’బై లైన్‌తో రాసేవారు. కరపత్ర పత్రికగా ప్రజల్లోకి వచ్చిన మురసొలికి 1940 నుంచి కొంత కాలం బ్రేక్‌ పడింది. 1944 జనవరి 14 నుంచి వారపత్రికగా ఆవిర్భవించింది. తిరువారూర్‌ నుంచి చెన్నై కోడంబాక్కం వేదికగా 1954 నుంచి మురసొలి పత్రిక వచ్చింది. 1960 సెప్టెంబర్‌ 17 నుంచి దినపత్రికగా మారింది.  

కలైజ్ఞర్‌ పేరుతో చానళ్లు 
మురసొలి దినపత్రికగా మారినా రోజూ కరుణానిధి పేరిట ఓ కాలం ఉండేది. 2016లో అనారో గ్యం బారిన పడిన తర్వాత కరుణ పేరిట కాలం ఆగింది.  డీఎంకే అధినేతగా, సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత పత్రిక వ్యవహారాలను ఆయన మేనళ్లుడు మురసొలి మారన్‌ చేపట్టారు. ఆ తదు పరి మురసొలి మారన్‌ తనయులు, దయానిధి మారన్, కళానిధి మారన్‌ నేతృత్వంలో సన్‌ గ్రూప్‌ ఆవిర్భావం, దినకరన్‌ దినప్రతిక చిక్కడం వెరసి కరుణకు కలసి వచ్చాయి. 2007లో కలైజ్ఞర్‌ పేరుతో టీవీ చానళ్లు పుట్టుకు రావడంతో మీడి యాలో కరుణ కుటుంబం కీలకంగా మారింది. 

తెలుగువారి భాషా స్ఫూర్తి భేష్‌
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరుణానిధి తండ్రి తమిళుడైనా తల్లి మాతృభాష తెలుగు కావడంతో తెలుగువారిపై మక్కువ కనబరిచేవారు. అంతేగాక ఒక సభలో తెలుగువారికి మంచి కితాబు ఇచ్చారు. చెన్నైలో ప్రముఖుడైన డాక్టర్‌ సీఎంకే రెడ్డి అధ్యక్షునిగా అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్‌) స్థాపించిన తరువాత తొలి ఉగాది వేడుకలను 1990లో యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ వేడుకలకు గంట సమయం మాత్రమే కేటాయించిన అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి 3 గంటలపాటు కూర్చుండిపోయారు. ‘చెన్నైలో జరిగిన ఉగాది వేడుకలకు ఇంతమంది తెలుగువారా. కొన్నేళ్ల క్రితం తెలుగువారు లేనిదే తమిళనాడు లేదు కదా. వివిధ పార్టీలకు చెందిన నేతలను ఒకే వేదికపై చూస్తుంటే ముచ్చటేస్తోంది. తెలుగుభాషపై ఉన్న మమకారమే వారందరినీ కలిపింది. ఇలాంటి భాషా స్ఫూర్తితోపాటూ తెలుగువారి నుంచి తమిళులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది..’అంటూ కరుణానిధి తెలుగువారిని కొనియాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement