అప్పీలు కలకలం | Karnataka to appeal against Jayalalithaa's acquittal | Sakshi
Sakshi News home page

అప్పీలు కలకలం

Jun 2 2015 3:16 AM | Updated on Sep 2 2018 5:24 PM

అప్పీలు కలకలం - Sakshi

అప్పీలు కలకలం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ వెలువడిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం

చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ వెలువడిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తలమునకలై ఉన్న అన్నాడీఎంకే శ్రేణులు పిడుగుపాటులాంటి ఈ సమాచారంతో ఆందోళనలో మునిగిపోయాయి.
 
 ఆస్తుల కేసులో కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలుశిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పు కారణంగా జయ జైలు పాలుకావడమేగాక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవులను సైతం కోల్పోయారు. బెయిల్‌పై విడుదలైన జయ తనకు పడిన శిక్షపై అప్పీలు చేయగా కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పు చెప్పింది. తాజా తీర్పుతో జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి పదవిని సైతం చేపట్టారు. ముఖ్యమంత్రిగా జయ కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉన్నందున ఆర్కేనగర్ సిద్ధమైంది. ఈనెల 5వ తేదీన జయలలిత నామినేషన్ దాఖలు చేస్తుండగా, 27వ తేదీన ఉప ఎన్నికపై పోలింగ్ జరగనుంది.
 
 అప్పీలుపై ఆందోళన:
 ఆస్తుల కేసులో ముద్దాయి నుంచి నిర్దోషిత్వంతో ముఖ్యమంత్రిగా మారిన జయలలితకు అప్పీలుతో కొత్త చిక్కువచ్చి పడింది. గత నెల 11వ తేదీన జయను నిర్దోషిగా పేర్కొంటూ తాజా తీర్పు వెలువడగానే అన్నాడీఎంకే సంబరాలు చేసుకుంది. అమ్మ వెంటనే సీఎం కాబోతున్నారని ఆనందపడిపోయింది. రాష్ట్రంలోని విపక్షాలు సైతం తీర్పును నిరసిస్తూ అదే స్థాయిలో విరుచుకుపడ్డాయి. అప్పీలుపై కర్నాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. జయ, కేంద్రప్రభుత్వాల మధ్య లోపాయికారి ఒప్పందం కారణంగానే ఇలాంటి తీర్పు వెలువడిందని విపక్షాలు విమర్శించాయి. జయ ఆస్తుల లెక్కలను తారుమారు చేసి నిర్దోషిగా చూపారని కోర్టు తీర్పునే దుయ్యబట్టాయి.
 
  కర్నాటక ప్రభుత్వ న్యాయవాది ఆచారి సైతం అప్పీలుకు వెళ్లాలని తమ ప్రభుత్వాన్ని కోరారు. తీర్పు అనంతరం ఉత్పన్నమైన పరిణామాలపై జయలలిత 12 రోజుల పాటూ న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. న్యాయకోవిదుల నుండి ఎటువంటి హామీ వచ్చిందో ఏమో గత నెల 23 వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉండగా, అప్పీలుపై తర్జనభర్జనలు చేసిన కర్నాటక ప్రభుత్వం సోమవారం మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించి అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించింది. జయ కేసులో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు వెళ్లాలని మంత్రి మండలి సమావేశాల్లో తీర్మానించినట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం ప్రకటించారు.
 
 మరో రెండురోజుల్లో సుప్రీం కోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నాటక ప్రభుత్వం అప్పీలు చేయబోయే తరుణంలో జయ నామినేషన్‌కు సిద్ధం  అవుతున్నారు. అప్పీలులో ఏఏ అంశాలు ప్రతిపాదిస్తారోనని రాష్ట్రంలో రసవత్తరమైన చర్చ సాగుతోంది. తాజాతీర్పు అమలుపై తక్షణం నిషేధం విధించాలని, మలి తీర్పు వెలువడే వరకు జయ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగకుండా ఉత్తర్వులు జారీచేయాలని కర్నాటక ప్రభుత్వం కోరిన పక్షంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఇరుకున పడుతుందని అంటున్నారు.
 
  కర్నాటక ప్రభుత్వం కోరిన రీతిలోనే సుప్రీం కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన పరిస్థితిలో అమ్మ మరోసారి పదవీచ్యుతులు అవుతారా అనే అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మరి అదే జరిగితే అమ్మ కోసమే సిద్ధం చేసుకున్న ఆర్కేనగర్‌లో ఉప ఎన్నిక మాటేమిటనే ప్రశ్న ఉత్పన్నమైంది. కర్నాటక ప్రభుత్వం అప్పీలును చట్టపరంగానే ఎదుర్కొంటామని అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉత్సాహంగా ఉన్న అన్నాడీఎంకే నేతలను అప్పీలు వ్యవహారం నిరుత్సాహానికి గురిచేసింది. సుప్రీం కోర్టు నుండి ఏక్షణాన ఎటువంటి సమాచారం వినాల్సి వస్తుందోననే ఆందోళన నెలకొని ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement