కర్నాటక అలంద్‌లోని కుడల్ హంగర్గ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహ్మద్ సహా 16 మంది కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
షోలాపూర్, న్యూస్‌లైన్:తీర్థయాత్రకు వెళ్లిన మహ్మద్ కుటుంబం తిరిగి ఇంటికి రానేలేదు. కర్నాటక అలంద్‌లోని కుడల్ హంగర్గ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహ్మద్ సహా 16 మంది కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వీరంతా షోలాపూర్ జిల్లావాసులని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో పది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు.
షోలాపూర్ జిల్లా అక్కల్‌గుడ్ తాలుకా తడవళ్ గ్రామానికి చెందిన మహ్మద్ ముల్లా, రంజాన్ ముల్లా కుటుంబానికి చెందిన మనుమరాళ్ల పుట్టెంటుకలు తీయడానికి కర్ణాటకలోని ఖ్వాజాబందే నవాజ్ దర్గాకు ఆదివారం అర్ధరాత్రి మినీ టెంపోలో బయలుదేరారు. సోమవారం తెల్లవారు జామున ఐదింటికి కుడల్ హంగర్గ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న కర్నాటక రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సు ముల్లా కుటుంబం ప్రయాణిస్తున్న టెంపోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు టెంపో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన పడిపోయింది. ఆ సమయంలో అందరు గాఢనిద్రలో ఉన్నారు.
గాయపడిన వారిలో కొందరిని ఆలందీ, గుల్బర్గాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. మృతులు, క్షతగాత్రుల పేర్లు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక పోలీసు అదికారి ఒకరు తెలిపారు.