రాష్ర్టంలోని రెండు లోక్‌సభ నియోజక వర్గాలకు ఈ నెల 21న జరుగనున్న ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తమయ్యాయి.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని రెండు లోక్‌సభ నియోజక వర్గాలకు ఈ నెల 21న జరుగనున్న ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తమయ్యాయి. అప్పుడే విమర్శల పర్వం ప్రారంభమైంది. జేడీఎస్‌కు చెందిన హెచ్‌డీ. కుమారస్వామి, ఎన్. చలువరాయస్వామిలు శాసన సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కుమారస్వామి రాజీనామా చేసిన బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం నుంచి ఆయన సతీమణి అనితా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే. సురేశ్ బరిలో ఉన్నారు. చలువరాయ స్వామి రాజీనామా చేసిన మండ్య స్థానంలో బహు భాషా నటి రమ్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జేడీఎస్ అభ్యర్థిగా సీఎస్. పుట్టస్వామి రంగంలో ఉన్నారు. బీజేపీ కూడా రంగంలో ఉన్నప్పటికీ పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష జేడీఎస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనేది బహిరంగ రహస్యం.
రమ్య వైరాగ్యం
మండ్యలో శనివారం నామినేషన్‌ను దాఖలు చేసిన సందర్భంలో తన పెంపుడు తండ్రి ఆర్‌టీ. నారాయణ్ గుండె పోటుతో మరణించడంతో నటి రమ్య ఖిన్నులయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి తీవ్రంగా కుంగిపోయారు. ఉప ఎన్నికలో పోటీ చేసే ఆసక్తి కూడా లేదని చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు గాబరా పడ్డారు. ఆమెకు ధైర్యం నూరిపోసి పోటీకి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లి రంజితతో పాటు తన ఆప్తులతో సమాలోచనలు సాగించిన అనంతరమే ఆమె ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నారాయణ్ అంత్యక్రియలను ఆదివారం మైసూరులో నిర్వహించారు. ఈ కార్యాలకు హాజరైన కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం. కృష్ణ, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మంత్రి అంబరీశ్‌ల వద్ద రమ్య తన అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. తండ్రి సూచన మేరకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున, ప్రజా సేవకు లభించిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దని వారు ఆమెను అనునయించినట్లు సమాచారం. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో ఆమెను బరిలో కొనసాగించడం తప్ప కాంగ్రెస్‌కు వేరే మార్గం లేకుండా పోయింది.
జేడీఎస్‌పై సీఎం విమర్శలు
ఉప ఎన్నికల్లో బీజేపీతో అవగాహనకు రావాలని ప్రయత్నించడం పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జేడీఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. బెంగళూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పార్టీల అవగాహన వల్ల కాంగ్రెస్‌కు లాభం చేకూరుతుందని, జేడీఎస్ అసలు రంగు బయట పడుతుందని తెలిపారు. తాము లౌకికవాదులమని చెప్పుకునే జేడీఎస్ అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు కుమారస్వామిల గురించి ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. మత తత్వ పార్టీలకు, జేడీఎస్‌కు మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. పార్టీ పేరుకు సెక్యులర్ అని తగిలించుకుంటే సరిపోదని ఎద్దేవా చేశారు. కాగా పెంపుడు తండ్రి ఆకస్మిక మరణంతో నటి రమ్య పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. అయితే ఈ పరిస్థితుల్లో వెనక్కు తగ్గడం సాధ్యం కాదని ఆమెకు నచ్చజెప్పామని ఆయన వివరించారు.