మాజీ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీకి భారీస్థాయిలో కొన్ని పత్రాలు లభించినట్లు తెలిసింది.
ముంబై: మాజీ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీకి భారీస్థాయిలో కొన్ని పత్రాలు లభించినట్లు తెలిసింది. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన మహారాష్ట్ర సదన్‌కు సంబంధించి అక్రమాలు చోటుచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును చేపట్టింది. ముంబైలోని ప్రభుత్వ రెస్ట్ హౌస్‌లో తాళం వేసి ఉన్న గదిలో సిట్‌కు కొన్ని పత్రాలు లభించాయి.
అవి మహారాష్ట్ర సదన్ నిర్మాణంలో జరిగిన అవకతవకలకు సంబంధించినవిగా అధికారులు అనుమానిస్తున్నారు. సిట్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాంద్రా కాలానగర్ ప్రాంతంలో ఉన్న ఈ విశ్రాంతి గృహంలో అధికారులు సోదాలు నిర్వహించారు. చాలా కాలంగా తాళం వేసి ఉన్న ఆ గదిని పీడబ్ల్యూడీ అధికారుల సహాయంతో తెరిచారు. ఆ గదిలో పీడబ్ల్యూడీకి సంబంధించిన ఎనిమిది సంచుల పత్రాలు ఉన్నాయని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి తెలిపారు. ఇంకా కొన్ని ఫైళ్లు, మొబైల్ ఫోన్లు, ఓ సీడీ, మద్యం సీసాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ పత్రాలను ముందుగా పరిశీలించిన తరువాతనే వాటిలో ఏముందో చెప్పగలమని డీజీపీ (ఏసీబీ) ప్రవీణ్ దీక్షిత్ అన్నారు.
న్యూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్, ముంబైలో మరో రెండు ప్రభుత్వ భవనాల నిర్మాణంలో మంత్రిగా ఉన్న ఛగన్ భుజ్‌బల్ ఆశ్రీత పక్షపాతం, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బహిరంగ విచారణకు అనుమతినివ్వాలన్న ఏసీబీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్‌లో పచ్చ జెండా ఊపింది.


