విధానసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే జేజే కాలనీల్లో నివసించే ప్రతి పేద కుటుంబానికి ఫ్లాట్లు మంజూరు చేస్తామని బీజే పీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ హామీ ఇచ్చారు.
ప్రతి పేద కుటుంబానికి ఫ్లాట్లు
Aug 4 2013 10:49 PM | Updated on Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే జేజే కాలనీల్లో నివసించే ప్రతి పేద కుటుంబానికి ఫ్లాట్లు మంజూరు చేస్తామని బీజే పీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ హామీ ఇచ్చారు. ‘జుగ్గీ జోపిడీ మహాసమ్మేళనం’ పేరిట బీజేపీ ఢిల్లీప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం తల్‌కటోరా స్టేడియంలో భారీ సభ నిర్వహించారు. దీనికి నగరంలోని వివిధ జుగీ ్గజోపిడీ ప్రాంతాల్లోని పేదలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. వీరినుద్దేశించి గోయల్ మాట్లాడుతూ.. సహాయం కోసం తన వద్దకు వచ్చే వారి కోసం ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయన్నారు. గతంలోనూ తాను పేదలకు ఎంతో దగ్గరగా ఉంటూ సేవలందించానని గుర్తు చేశారు. ప్రస్తుతం పార్టీ తరఫున ఇస్తున్న వాగ్ధానాలను తనను చూసి నమ్మవద్దని, గతంలో తాను చేపట్టిన సేవా కార్యక్రమాలు, తమ పార్టీ నిజాయితీని చూసి నమ్మవచ్చన్నారు.
కాంగ్రెస్‌పార్టీ మాదిరిగా ఎన్నికల కోసం హామీలివ్వడం తమకు చేత కాదన్నారు. పేదలకు 60వేల చౌక ధరలు ఇళ్లు నిర్మించి ఇస్తామని గొప్పలు చెప్పిన షీలా సర్కార్ ఇప్పటికీ 14వేల మందికి మాత్రమే నిర్మించి ఇచ్చిందన్నారు. మిగిలిన వారికి ఇప్పటికీ ఎలాంటి సహాయం అందలేదని చెప్పారు. తక్కువ ధరకే విద్యుత్, క్రమం తప్పకుండా ఇళ్లకు రోజు నీటి సరఫరా అందిస్తున్నామన్నారు. పరిశుభ్రత, మహిళల రక్షణ, ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు. పేదలు తనను ‘విజయ్‌గోయల్ జుగ్గీవాలా’అని పిలుచుకోవడాన్ని స్వాగతిస్తానన్నారు.
‘పేదలందరికీ రేషన్‌కార్డులు, అన్ని ఇళ్లలో విద్యుత్ వెలుగులు, విద్య,వైద్యం, రక్షణ అన్ని అంశాల్లో మెరుగైన సేవలందిస్తాం. జేజే క్లస్టర్లలోని 22 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూర్చేందుకు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మా అజెండాలో పొందుపర్చాం’అని గోయల్ అన్నారు. జేజే కాలనీల్లోని వారందరికీ ఉచితంగా ఇల్లు కట్టిస్తామన్నారు. అన్ని బస్తీలకు విద్యుత్ సరఫరా, రేషన్‌కార్డులను పంపిణీ చేయడంతోపాటు బస్తీవికాస్ కేంద్రాలను పునఃప్రాంభిస్తామన్నారు. నిరంతర నీటి, విద్యుత్ సరఫరా అందజేస్తామని గోయల్ హామీ ఇచ్చారు. జేజే కాలనీలన్నింటిలో డ్రై నేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. ప్రత్యేకంగా పోలీస్‌బూత్‌లను ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తామన్నారు. జేజేకాలనీవాసులకు ఇవ్వబోయే ప్లాట్లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ)మోడల్‌లో అభివృద్ధి చేస్తామన్నారు.
కాంగ్రెస్‌వి అన్నీ గొప్పలే: గడ్కరీ
‘దేశానికి స్వాతంత్య్ర వచ్చిన తర్వాత పండిత్ జవహర్‌లాల్‌నెహ్రూ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆమె తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధానిగా చేశారు. ప్రస్తుతం రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్‌పార్టీ దేశంలో పేదరికాన్ని రూపుమాపుతామంటూ వాగ్ధానాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీవన్నీ గొప్పలే తప్ప..చేతల్లో అవి ఉండవు’అని బీజేపీ సీనియర్‌నాయకుడు నితిన్ గడ్కరీ విమర్శించారు. పదిహేనేళ్లలో ఢిల్లీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఎప్పుడూ గొప్పగా చెబుతుంటారని, క్షేత్రస్థాయిలో ఆ ఫలాలు పేదలకు అందుతున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు.
మరోమారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ప్రజలకు చేసే మేలుకంటే వారి జేబులు కొల్లగొట్టడమే పెరుగుతుందన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటి పరిస్థితులకీ, నేటికీ చాలా తేడా ఉందన్నారు. ధరల పెరుగుదల, విద్యుత్, నీటిబిల్లులు తదితరాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఇన్ని ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్‌పార్టీకి తమ ఓటుతో ప్రతిఒక్కరూ బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే సుభాష్‌సచ్‌దేవ్, బీజేపీ నాయకులు రమేశ్ బిదూరీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement