ఆ కుటుంబానికి కరోనా ఎలా సోకింది?

Family Travels With Body From Mumbai Tests Coronavirus Positive - Sakshi

బెంగుళూరు : కరోనా వైరస్‌ ఎప్పుడు ఏ రూపంలో మనషులపై దాడి చేస్తుందనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. మనం ప్రయాణం చేసే సమయంలో మన పక్క నుంచి వెళ్లే వారిలో ఎవరికి వైరస్‌ ఉందనేది తెలియదు. తాజాగా కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి కరోనా వైరస్‌ ఎలా సోకిందో తెలియడం లేదు. అసలు ఎవరి ద్వారా కరోనా సోకిందనేది మిస్టరీగా మారింది. వివరాలు.. మాండ్య జిల్లాకు చెందిన ఓ ఆటో రిక్షా డ్రైవర్‌ ముంబయిలో జీవనం కొనసాగిస్తున్నాడు. అతను గుండెపోటుతో ఇటీవలే మృతి చెందాడు. దీంతో అధికారుల అనుమతి తీసుకుని మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు సొంత జిల్లా మాండ్యకు తరలించారు. మృతదేహంతో పాటు ఆరుగురు ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు.(పోలీసుల సజీవ దహనానికి యత్నం)

మార్గం మధ్యలో ఓ మహిళతో పాటు ఆమె కుమారుడికి వీరు లిఫ్ట్‌ ఇచ్చారు. అయితే డ్రైవర్‌ అంత్యక్రియలు ముగిసిన తర్వాత.. నిబంధనల ప్రకారం అతని కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆరుగురిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అంతే కాదు.. మధ్యలో వాహనం ఎక్కిన మహిళకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. డ్రైవర్‌ కుమారుడు ఓ ప్రయివేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. అతని ద్వారానే కుటుంబ సభ్యులకు కరోనా సోకి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మధ్యలో ఎక్కిన మహిళ ద్వారా వ్యాపించిందా? అనేది తేలాల్సి ఉంది.

ఈ ఘటనపై మాండ్య డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ ఎంవీ వెంకటేశ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మృతదేహం వెంట ఆరుగురికి ఎందుకు అనుమతిచ్చారని ముంబయి అధికారులను ఆయన ప్రశ్నించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించకుండా.. కంటైన్‌మెంట్‌ జోన్‌ నుంచి ఎలా బయటకు ఎలా పంపిస్తారని అడిగారు. అంత్యక్రియలకు హాజరైన వారిలో ఎవరెవరికి కరోనా సోకిందో తెలియాల్సి ఉంది. కాగా అంత్యక్రియలకు హాజరైన వారంతా భయంతో వణికిపోతున్నారు.
(17దాకా లాక్‌డౌన్‌.. సడలింపులివే..!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top