17దాకా లాక్‌డౌన్‌.. సడలింపులివే..!

Lockdown Extended Till May 17 Relaxations In Orange Green Zones - Sakshi

మినహాయింపులతో మే 4 నుంచి మరో రెండు వారాలు కొనసాగింపు..  

మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో 2 వారాలు కొనసాగించేందుకు కేంద్రం నిర్ణయించింది. మూడో దశ లాక్‌డౌన్‌ పరిమిత స్థాయిలో, పలు మినహాయింపులతో  ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. మే 4 నుంచి మరో రెండు వారాలపాటు (17 దాకా) దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై, మెట్రో, విమాన, రైల్వే సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్, జిమ్స్, సినిమా థియేటర్స్, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ల మూసివేత కొనసాగుతుందని పేర్కొంది. ప్రార్థనా ప్రాంతాలు, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమావేశాలతో పాటు ప్రజలు సామూహికంగా పాల్గొనే  కార్యక్రమాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. జోన్లతో సం బంధం లేకుండా ఈ నిషేధం ఉంటుందని పేర్కొంది.

రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్ల వారీగా కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని తెలిపింది. కేంద్ర హోం శాఖ అనుమతించిన కొన్ని అవసరాలకు మాత్రం విమానం, రైలు, రోడ్డు ప్రయాణాలను అనుమతిస్తారని పేర్కొంది. ఈ కాలంలో జోన్‌లవారీగా అనుసరించాల్సిన నిబంధనలను హోం శాఖ విడుదల చేసింది. వారం ప్రాతిపదికగా దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్‌లుగా వర్గీకరిస్తున్నామని, తదనుగుణంగా నిబంధనల అమలు ఉంటుందని పేర్కొంది. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఆంక్షలను విధించుకోవచ్చని పేర్కొంది. అంతర్రాష్ట్ర సరుకు రవాణాను అనుమతించాలని రాష్ట్రాలను కోరింది. ఖాళీ ట్రక్కులను అనుమతించాలంది.  చదవండి: ఎన్నాళ్లో వేచిన ఉదయం

రాష్ట్రంలో యథాతథం
5న మంత్రివర్గ భేటీలో సడలింపులపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ యథాతథంగా కొన సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకోవ డంతోపాటు మద్యం దుకాణాలు తెరిచేందుకు సహా పలు అంశాల్లో కొత్తగా సడలింపులనిచ్చింది. దేశవ్యాప్తంగా మే 4 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఆ తేదీ నుంచి అమల్లోకి రావు. ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల అమలుకు ఉన్న అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 5న ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశమై ఈ అంశాలపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్‌ ఆమోదించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే రాష్ట్రంలో అమల్లోకి రానున్నాయి. అంటురోగాల నియంత్రణ చట్టం, విపత్తుల నిర్వహణ చట్టాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు విచక్షణాధికారాన్ని కలిగి ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకొనే నిర్ణయాలు మే 6 నుంచి లేదా 8 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చే అవకాశముంది.  చదవండి: తెలంగాణలో 6 రెడ్‌ జోన్‌ జిల్లాలు

ముఖ్య సడలింపులు..
రెడ్‌జోన్‌: ఒక వ్యక్తి నడిపే షాపులు, కాలనీల్లోని షాపులు మాత్రం ఏ నిబంధనలు లేకుండా తెరుచుకోవచ్చు. అయితే వీటి వద్ద భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. 
►కార్లు కేవలం ఇద్దరు వ్యక్తులతో తిరగవచ్చు, బైక్‌పై ఒక్కరే ప్రయాణించాలి.
ఆరెంజ్‌ జోన్‌: ఒక డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులతో క్యాబ్‌లకు అనుమతి.
►జిల్లాల్లో వాహనాలు తిరిగేందుకు(ఎంపిక చేసినవే) ఓకే
గ్రీన్‌జోన్‌: 50% ఆక్యుపెన్సీతో బస్సులు ప్రయాణించవచ్చు.
►మద్యం, పాన్, సిగరెట్‌ విక్రయాలకు షరతులతో అనుమతి.
అయితే ఆరెంజ్‌ జోన్‌లో వీటి విక్రయాలపై స్పష్టత లేదు.

దేశవ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి ఆధారంగా దేశవ్యాప్తంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా పేర్కొంటూ శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ జాబితా విడుదల చేసింది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న 130 జిల్లాలను రెడ్‌ జోన్‌లో, వైరస్‌ తీవ్రత కొద్దిగా ఉన్న 284 జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌లో, కేసులేవీ నమోదు కాని 319 జిల్లాలను గ్రీన్‌జోన్‌లో చేర్చింది. మే 3 తరువాత వారం పాటు ఈ జాబితా అమల్లో ఉంటుంది. తదనుగుణంగా రాష్ట్రాలు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతీ వారం,  లేదా తీవ్రతను బట్టి వారం లోపు కానీ ఈ జాబితాను సవరిస్తారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్‌లను రెడ్‌ జోన్‌లో చేర్చారు. లిక్కర్, పాన్, పొగాకు అమ్మకాలకు హోంశాఖ అనుమతినిచ్చింది. అయితే, అర్బన్‌ ప్రాంతాల్లోని మార్కెట్లు, మాల్స్‌లో వీటి అమ్మకాలను అనుమతి లేదు. అమ్మకాల సందర్భంగా ఆరు అడుగుల భౌతిక దూరం తప్పకపాటించాలి. అయితే, లిక్కర్‌ తదితరాల అమ్మకాలు గ్రీన్‌జోన్‌లో అనుమతించినా, ఆరెంజ్‌ జోన్‌లో వీటి అనుమతిపై స్పష్టతలేదు. 

జోన్లకు అతీతంగా..
►దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు రద్దు. వైద్య, రక్షణ రంగాలకు మినహాయింపు.
►కేంద్రం అనుమతించిన వారు తప్ప మిగిలిన వారికి రైళ్లలోప్రయాణం నిషేధం.
►కేంద్రం అనుమతించిన బస్సులు మినహా అన్ని అంతర్రాష్ట్ర బస్సులకు అనుమతి లేదు
►మెట్రో రైల్‌ సర్వీసులు
►అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణాలు (ఇండివిడ్యుయల్‌) నిషేధం. మెడికల్‌ లేదా కేంద్రం అనుమతించిన వారికి మాత్రమే అవకాశం
►అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సంబంధిత సంస్థలన్నీ మూసివేత
►అన్ని సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు, జిమ్, బార్లు, సమావేశ మందిరాల మూసివేత
►సామాజిక, రాజకీయ, క్రీడా సంబంధ కార్యక్రమాలు నిషేధం
►అన్ని రకాల మత కార్యక్రమాల రద్దు.

రెడ్‌ జోన్‌లో..
సైకిల్‌ రిక్షాలు, ఆటో రిక్షాలు నడపొద్దు
టాక్సీలు, క్యాబ్‌లు తిరగొద్దు
జిల్లాలోపలగానీ, జిల్లా బయటకుగానీ బస్సులు తిరగకూడదు
సెలూన్లు, స్పాలు మూసేయాలి.

రెడ్‌ జోన్‌లలో సడలింపులు
కార్లు కేవలం ఇద్దరు వ్యక్తులతో తిరగొచ్చు, బైక్‌ పై ఒక్కరే ప్రయాణించాలి
పరిశ్రమల్లో అత్యవసర సరుకులను ఉత్పత్తి చేసేవి, మెడికల్‌ ఉత్పత్తులు, ఐటీ హార్డ్‌ వేర్‌ రంగం, సరైన భౌతిక దూరం పాటిస్తూ జూట్‌ మిల్లుల నిర్వహణ వంటి వాటికి అనుమతి ఉంది. పల్లె ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు వర్తిస్తాయి
బయటి నుంచి కూలీలను తీసుకురాకుండా ఉన్న వారితో  పట్టణాల్లో భవన నిర్మాణ పనులు, రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతాయి
మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని అన్ని మాల్స్‌ మూసివేత. కానీ అత్యవసర సరుకులను అమ్మవచ్చు.
ఒకే ఒక వ్యక్తి నడిపే షాపులు, కాలనీల్లోని షాపులు ఏ నిబంధనలు లేకుండా తెరుచుకోవచ్చు. వీటి వద్ద భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది.
అత్యవసర వస్తువులకు మాత్రమే ఈ కామర్స్‌ సంస్థలకు అనుమతి ఉంది.
33శాతం సిబ్బందితో ప్రైవేటు ఆఫీసుల నిర్వహించుకోవచ్చు.
డిప్యూటీ సెక్రటరీ లెవల్‌ ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో పని చేయవచ్చు. మిగిలిన ప్రభుత్వ ఆఫీసులన్నీ కేవలం 33 శాతం సిబ్బందితో పనిచేయవచ్చు.

ఆరెంజ్‌ జోన్‌లలో
జిల్లాల లోపల, జిల్లాల బయటకు బస్సుల ప్రయాణాలపై నిషేధం
ఒక డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులతో క్యాబ్‌లను అనుమతిస్తారు.
జిల్లాల్లో వాహనాలు తిరిగేందుకు (ఎంపిక చేసిన వాటికి మాత్రమే) అనుమతిస్తారు

గ్రీన్‌ జోన్‌లలో..
జోన్లకు అతీతంగా కేంద్రం విధించిన నియమాలు తప్ప మిగతా వాటికి అనుమతి ఉంటుంది.
50 శాతం సీట్ల సామర్థ్యంతో బస్సులు ప్రయాణించవచ్చు.
బస్సు డిపోలు 50శాతం మందితో నడుపుకోవచ్చు.

నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం ప్రకారం పడే శిక్షలివీ..
►కోవిడ్‌ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. దీనికి జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష పడేఅవకాశం ఉంది.
►ప్రజలను భయాందోళనకు గురిచేసే నిరాధార ప్రకటనలు, హెచ్చరికలు చేసినట్లయితే జరిమానా, ఏడాది జైలు.
►ప్రభుత్వాధికారులు విధులు పాటించకపోతే వారిపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. దీనికి ఏడాది వరకు జైలు శిక్ష.
►ఈ చట్టాన్ని అతిక్రమించే కంపెనీలకు ఆయా కంపెనీల అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కంపెనీలోని పై అధికారుల కనుసన్నల్లో ఆ అతిక్రమణ జరిగితే, డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీలు బాధ్యత వహించాలి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top