85 రోజులుగా నరకాన్ని చూస్తున్నాం | divis pharma unit victims meets YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

85 రోజులుగా నరకాన్ని చూస్తున్నాం

Nov 23 2016 9:14 AM | Updated on Sep 28 2018 4:30 PM

కాలుష్య పరిశ్రమ వద్దంటూ సభలో విలపిస్తూ చెబుతున్న తాడిపర్తి అమ్మాజీ - Sakshi

కాలుష్య పరిశ్రమ వద్దంటూ సభలో విలపిస్తూ చెబుతున్న తాడిపర్తి అమ్మాజీ

దివీస్‌ బాధితులు తమ ఇబ్బందులను వైఎస్‌ జగన్‌కు ఇలా వివరించారు.

వైఎస్‌ జగన్‌ వద్ద దివీస్‌ బాధితుల ఆవేదన

సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘మంచినీరు ఇస్తున్నట్టు మభ్యపెట్టి ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మా అనుమతి లేకుండానే మా పొలాలు తీసుకుంటామంటున్నారు. 85 రోజులుగా పోలీసులతో మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారు. ఫ్యాక్టరీ వల్ల మా జీవితాలు సర్వనాశనమవుతాయి. పొలాలు తీసుకుంటే మేమెక్కడి పోవాలి. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీ పెట్టనీయం. మీ అండ మాకు కావాలి’’ అంటూ దివీస్‌ ప్రతిపాదిత గ్రామ ప్రజలు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వద్ద తమ కష్ట, నష్టాలు చెప్పుకొన్నారు. తుని నియోజకవర్గం తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్‌ ప్రతిపాదిత గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  మంగళవారం నిర్వహించిన బహిరంగ సభకు ఆయన విచ్చేశారు. ఈ సభలో బాధితులు తమ ఇబ్బందులను వైఎస్‌ జగన్‌కు ఇలా వివరించారు.

మంచినీరు కుళాయిలు పెట్టి మభ్యపెట్టారు
ఈ మండలంలో 50 గ్రామాలు ఫ్యాక్టరీకి అతి దగ్గరలోనే ఉన్నాయి. మేమంతా సన్న, చిన్నకారు రైతులం. ఎన్టీఆర్‌ పేరుమీద మంచినీటి కుళాయిలు పెట్టి... ఆ తర్వాత ఫ్యాక్టరీ బోర్డులు పెట్టాక తెలిసింది. ఎండాకాలంలో కూడా ఇక్కడ తీరంలో మంచి వాతావరణం ఉంటుంది. ఇదంతా పాడవుతుందని ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తే మాపై కేసులు పెట్టారు. పిఠాపురం సీఐ ఆడపిల్లలని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు.
– మట్ల ముసలయ్య, రైతు, పంపాదిపేట

ప్రాణాలు పోయినా ఫ్యాక్టరీని అడ్డుకుంటాం
దివీస్‌కు వ్యతిరేకంగా 82 రోజులుగా పోరాడుతున్నాం. 144 సెక్షన్‌ పెట్టి వేధిస్తున్నారండి. మాకు ఎమ్మెల్యేగారు అండగా ఉన్నారు. వామపక్షాల వాళ్లు, ఐద్వా వాళ్లు మాకు మద్దతుగా మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారండి. మా అనుమతి లేకుండానే మా పొలాలు తీసుకుంటారంట. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీని అడ్డుకుంటాం.     
– మంగులూరి సుశీల, కొత్తపాకల

Advertisement
 
Advertisement
Advertisement