వేతనం అడిగినందుకు కార్గో అధ్యాపకుడిపై దాడి


దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ :  పని చేసిన కాలానికి వేతనం అడిగినందుకు అధ్యాపకుడిని గదిలో నిర్భంధించి చితక బాదిన సంఘటన బెంగళూరు గ్రామీణ జిల్లా నెలమంగల గ్రామీణ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. హిందూపురానికి చెందిన రమేశ్‌చంద్ర(30) అనే అధ్యాపకుడు గత నాలుగు నెలలుగా నెలమంగల తాలూకా బూదిహాళ్ సమీపంలోని స్కంద ఏవియేషన్ అకాడెమి కాలేజీలో కార్గో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.ఇంత వరకూ ఒక్కనెల వేతనం కూడా ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎక్కువ య్యాయని కాలేజీ ప్రిన్సిపాల్ నీరజ వద్ద వాపోయాడు. కనీసం రెండు నెలల వేతనం ఇవ్వాలని డిమాండు చేసాడు. దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్ నీరజ నీ సేవలు మాకు అవసరం లేదు. నీ పని నచ్చలేదు. వెళ్లు.. జీతం లేదు, గీతం లేదంటూ దబాయించింది. దీంతో ఆగ్రహించిన రమేశ్‌చంద్ర వాదులాటకు దిగాడు. ప్రిన్సిపాల్ నీరజ తన భర్త సుదర్శన్‌కు ఫోన్‌చేసి విషయం తెలిపింది.సుదర్శన్ తన అనుచరులతో వచ్చి రమేశ్‌చంద్రను కాలేజీలోని ఒక గదిలో నిర్బంధించి చితకబాదాడు. ఒళ్లంతా గాయాలతో రమేశ్ నెలమంగల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఘటనకు సంబంధించి పాత్రికేయులతో మాట్లాడిన కాలేజీ యజమాని సుదర్శన్ వేతనం ఇచ్చామని, తన భార్య వద్ద హద్దుమీరి ప్రవర్తించినందుకు ఇలా చేసామని సమర్థించు కున్నారు. కేసు నమోదు చేసుకున్న గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top