సీఎం నవీన్‌ గద్దె దిగు

BJP demands to resign Naveen Patnaik as Chief Minister - Sakshi

 బీజేపీ ఆందోళన

 నవీన్‌ నివాస్‌ ముట్టడికి విఫలయత్నం

భువనేశ్వర్‌: నవీన్‌ పట్నాయక్‌  ముఖ్యమంత్రి గద్దె నుంచి తక్షణమే దిగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వర్గాలు పట్టుబడుతున్నాయి. కొరాపుట్‌ జిల్లా కుందులి గ్రామంలో  బాలికపై  సామూహిక లైంగికదాడి, ఆత్మహత్య సంఘటనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంచెలంచెలుగా ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక మాస్టర్‌ క్యాంటీన్‌ ఛక్‌ నుంచి శిశు భవన్‌ మార్గంలో   సోమవారం భారీ ఊరేగింపు నిర్వహించారు. ముఖ్యమంత్రి నవీన్‌ నివాస్‌ను ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు.

నగర కమిషనరేట్‌ పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని ఛేదించి నవీన్‌ నివాస్‌ వైపు దూసుకుపోయేందుకు ఆందోళనకారులు విజృంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో కాసేపు తోపులాట జరిగింది.  కుందులి బాలికపై సామూహిక లైంగికదాడితో బాధిత బాలిక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో వాస్తవ ఫోరెన్సిక్‌ పరీక్షల నివేదికను తారుమారు చేసి రాష్ట్ర క్రైం శాఖ ఆధ్వర్యంలో బాధిత  బాలిక కుటుంబానికి రూ.90 లక్షలు చెల్లించి కేసు బుట్ట దాఖలు చేసేందుకు విఫలయత్నం చేయడంతో రాష్ట్రంలో నవీన్‌ పట్నాయక్‌ సర్కారు తీరు ఏమిటో స్పష్టమైపోతోందని బీజేపీ ఆందోళనకారులు భారీ బ్యానర్లతో ఆరోపిస్తూ ప్రదర్శన నిర్వహించారు.

30 మంది  ఆందోళన కారుల అరెస్ట్‌
లోగడ 1999వ సంవత్సరంలో అంజనా మిశ్రా కేసు తరహాలో కుందులి బాలిక కేసును కూడా భూస్థాపితం చేసే యోచనతో అధికార పక్షం బిజూ జనతా దళ్‌ విశ్వ ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు నినాదాలు చేస్తూ పోలీసుల భద్రతా వలయాన్ని  ఛేదించేందుకు ఆందోళనకారులు ఉద్యమించారు. ఈ పరిస్థితుల్లో   144వ సెక్షన్‌ విధించిన పరిధిని అతిక్రమించిన 30 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top