విధానసభ ఎన్నికల్లో తమపార్టీ తరఫున పోటీచేసే ఏడుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన ఐదో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం విడుదల చేసింది.
ఆమ్ ఆద్మీ ఐదో జాబితా విడుదల
Aug 6 2013 10:31 PM | Updated on Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో తమపార్టీ తరఫున పోటీచేసే ఏడుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన ఐదో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం విడుదల చేసింది. దీనిలో బురాడి, ద్వారకా, గాంధీనగర్, జనక్‌పురి, కరోల్‌బాగ్, మెహ్రౌలీ సీటీ నుంచి పోటీపడనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వీరిలో సామాజిక కార్యకర్తలతోపాటు ఢిల్లీపోలీస్‌కి చెందిన ఓ రిటైర్డు కానిస్టేబుల్, బీజేపీ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఉన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ఇప్పటివరకు 40 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మిగిలిన సీట్ల అభ్యర్థులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. కార్యకర్తల డిమాండ్లకు అనుగుణంగా ఈ సీట్లకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని ఆప్ నేతలు తెలిపారు.
అభ్యర్థులు వీరే..:
బురాడి నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున సంజీవ్‌ఝా పోటీకి దిగనున్నారు. సంజీవ్‌ఝా తన మిత్రులతో కలిసి 12 ఏళ్లుగా ఢిల్లీలోని పలు బస్తీల్లో చిన్నారులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. స్థానిక యువకులతో కలిసి ‘నవపల్లవ్’అనే స్వచ్ఛంధ సంస్థను నెలకొల్పారు. పనికోసం ఢిల్లీకి వచ్చేవారికి సంస్థఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. అన్నాహజారే ఆందోళనల్లోనూ మొదటి నుంచి పాల్గొంటున్నారు.
ఢిల్లీ పోలీస్‌కి చెందిన రిటైర్డ్ కానిస్టేబుల్ కృష్ణకుమార్ రాటీ పార్టీ తరఫున ముండుకా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అన్నా హజారే జన్‌లోక్‌పాల్ ఉద్యమం చే స్తున్న సమయంలో కృష్ణ కుమార్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పేపర్లలో అన్నాహజారే ఉద్యమ వార్తలు చదివి, ఉద్యోగం వదులుకుని ఉద్యమంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ద్వారకాసిటీ నుంచి పోటీచేస్తున్న దాయిత్వ్ రవి సూర్యన్ 2000 నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.పేదలకోసం ఉచితంగా హోమియో థెరఫీ చికిత్స కేంద్రాన్ని నెలకొల్పారు. పేద తల్లిదండ్రుల కూతుళ్ల పెళ్లిళ్లు చేయడంలో ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు. గతంలో బీజేపీ కిసాన్ మోర్చాలో పనిచేశారు.
పాత ఢిల్లీలోని గాంధీనగర్ నుంచి పోటీకి దిగుతున్న స్వతంత్ర సేనానీ కాంగ్రెస్ పార్టీలో ఎన్నోఏళ్లుగా పనిచేస్తున్నారు. విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు.
కరోల్‌బాగ్ స్థానానికి పోటీచేస్తున్న యువ సమాజసేవకి విశేష్వ్రి ఢిల్లీవికాస్ సంస్థ ఉద్యోగి. పౌరహక్కులకోసం ఉద్యమిస్తున్నారు.
పశ్చిమ ఢిల్లీ జనక్‌పురి సిటీ నుంచి రాజేశ్‌శ్రషి పోటీ చేయనున్నారు. బీహార్‌లో నిర్వహించిన ఓ సెమినార్‌లో మాజీ రాష్ట్రపతి అబ్దుకలాం ప్రసంగం విన్నతర్వాత రాజేశ్‌లో ఎంతో మార్పు వచ్చింది. తన మిఠాయి దుకాణాన్ని మానుకుని బీహార్‌లోని ప్రతి గ్రామానికి తిరిగి బిందుసేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న సామాజిక ఆందోళనల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.
నరేంద్ర సెజవాల్‌ను ఆమ్‌ఆద్మీపార్టీ మహరౌలీ సిటీ నుంచి పోటీకి దింపుతోంది. కాశ్మీర్ నుంచి నిరాశ్రయులుగా ఢిల్లీకి చేరేవారికోసం స్నేహితులతో కలిసి పాటుపడుతున్నారు.పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు.
Advertisement
Advertisement