'నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు'

Yuvraj Singh Remembers Incidents After 2014 T20 World Cup Final  - Sakshi

ముంబై :  2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో  శ్రీలంకపై టీమిండియా ఓడిపోవడం పట్ల మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  ఆ మ్యాచ్‌లో 21 బంతులెదుర్కొని​ కేవలం 11 పరుగులు చేసిన యూవీ ఓటమికి పరోక్షంగా బాధ్యత వహించాల్సి వచ్చింది. దీంతో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించి కప్‌ను ఎగురేసుకుపోయింది. దీంతో యూవీ ఆటతీరుపై మీడియా దుమ్మెత్తి పోయగా అభిమానులు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. తాజాగా ఈ విషయాన్ని యూవీ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ('ఆరోజు పాంటింగ్‌ చెత్త నిర్ణయం తీసుకున్నాడు')

'ఆరోజు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి నేను పూర్తిగా బాధ్యత వహిస్తున్న. నేను ఆరోజు అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే నేను ఆడింది దేశం మొత్తం ప్రతిష్టాత్మకంగా భావించే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో. అదే ఒకవేళ వేరే మ్యాచ్‌ అయ్యుంటే ఇంతలా బాధపడేవాడిని కాదు. దాని తర్వాత చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపా. నేను ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టినప్పుడు మీడియా కళ్లన్నీ నామీదే ఉన్నాయి. వారంతా గట్టి గట్టిగా అరుస్తున్న సమయంలో నా చెవిలో హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని అక్కడినుంచి ఎలాగోలా బయటపడ్డాను. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నన్నందరు ఒక నేరస్తుడిలా చూశారు. నా ఇంటి మీద రాళ్లతో కూడా దాడి చేశారు. కానీ వారు చేసిన పని చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఆ క్షణం నాకు నేను అభిమానుల ఆశను మోసం చేపిన నేరస్తుడిలా కనిపించాను.  నేనెవెరినో చంపి జైలుకు వెళుతున్న ఫీలింగ్‌ కూడా కలిగింది. కానీ తర్వాత దాని నుంచి ఎలాగోలా బయటకు వచ్చినా నా జీవితాంతం ఆ సంఘటన గుర్తుండిపోతుందంటూ' యూవీ చెప్పుకొచ్చాడు.

2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు టీమిండియా గెలవడంలో యూవీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండు టోర్నీల్లోను ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఈ ఆల్‌రౌండర్‌ టోర్నీ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ముఖ్యంగా 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యూవీ ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టడం అప్పట్లో హైలెట్‌గా నిలిచింది. 2011 వరల్డ్‌ కప్‌ తర్వాత కాన్సర్‌ బారీన పడిన యూవీ లండన్‌కు వెళ్లి శస్త్ర చికిత్స తీసుకొని వచ్చి టీమిండియా తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడినా మునుపటి ప్రదర్శనను చూపించలేకపోయాడు. టీమిండియా తరపున యూవీ 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20లు ఆడాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top