గెలి‘చాను’... | Weightlifters in focus again, India vs Pakistan in men's hockey | Sakshi
Sakshi News home page

గెలి‘చాను’...

Apr 7 2018 12:25 AM | Updated on Apr 7 2018 12:25 AM

Weightlifters in focus again, India vs Pakistan in men's hockey - Sakshi

భారత ఆశల పల్లకిని మోస్తూ కామన్వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టర్లు మరోసారి మెరిశారు. పోటీల రెండో రోజు ఒక స్వర్ణం, ఒక కాంస్యం అందించారు. పతకాల పట్టికలో భారత్‌ను ఐదో స్థానానికి చేర్చారు. ఇప్పటివరకు నాలుగు పతకాలు రాగా... అన్నీ వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే కావడం విశేషం.

గోల్డ్‌కోస్ట్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు రెండో రోజూ స్వర్ణ సంబరం... వెయిట్‌ లిఫ్టింగ్‌లో, అందులోనూ మహిళల విభాగంలో మరో బంగారు పతకం... తొలి రోజు మీరాబాయి చాను అందించిన స్ఫూర్తితో, శుక్రవారం 53 కేజీల విభాగంలో సంజిత చాను స్వర్ణాన్ని ఒడిసి పట్టింది. ఈ క్రమంలో ఆమె స్నాచ్‌ రికార్డును బద్దలు కొట్టింది. మరోవైపు పురుషుల 69 కేజీల విభాగంలో 18 ఏళ్ల దీపక్‌ లాథర్‌ కాంస్యం నెగ్గి, కామన్వెల్త్‌ గేమ్స్‌లో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి భారత లిఫ్టర్‌గా రికార్డులకెక్కాడు.

సం‘జీత్‌’గయీ... 
గ్లాస్గోలో జరిగిన గత క్రీడల్లో 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సంజిత చాను ఈసారి అంతకంటే బరువైన విభాగంలోనూ మెరిసింది. వెన్నునొప్పి ఇబ్బంది పెడుతున్నా ఈ మణిపూర్‌ లిఫ్టర్‌ అద్భుత ప్రదర్శన చేసింది. స్వర్ణం నెగ్గే క్రమంలో సంజిత మొత్తం (స్నాచ్‌లో 84+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 108) 192 కేజీల బరువునెత్తింది. లొవా దికా టొవా (182 కేజీలు–పపువా న్యూ గినియా) రజతం... రచెల్‌ (181 కేజీలు–కెనడా) కాంస్యం గెలిచారు. మహిళల 58 కేజీల విభాగంలో భారత లిఫ్టర్‌ సరస్వతి రౌత్‌ నిరాశ పరిచింది. ఆమె మూడు ప్రయత్నాల్లో విఫలమైంది.  మరోవైపు సమీప ప్రత్యర్థి వైపవా అయోనే (సమోవా) క్లీన్‌ అండ్‌ జర్క్‌లో రెండుసార్లు ఫౌల్స్‌ చేయడంతో అదృష్టం కలిసివచ్చిన దీపక్‌ కాంస్యం అందుకోగలిగాడు. అతడు మొత్తం 295 కేజీల (స్నాచ్‌లో 136+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 159) బరువెత్తాడు. 

ఉద్వేగంతో కంటతడి... 
సంజీత గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ సందర్భంగా వెన్నునొప్పికి గురైంది. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఆమెను పోటీలకు పంపడంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీంతో విమర్శకులకు జవాబివ్వాలనే పట్టుదలతో బరిలో దిగింది. శుక్రవారం కూడా కొంత ఇబ్బంది పడినా... లక్ష్యం అందుకుంది. వీటన్నిటినీ తలచుకుని ఆమె పతకాల ప్రదానం సందర్భంగా ఉద్వేగానికి గురై కంటతడి పెట్టింది.  

దీపక్‌... అదృష్టం తోడై
దీపక్‌ మొదట స్విమ్మర్‌గా సైనిక క్రీడా శిక్షణ సంస్థలో తన ప్రస్థానాన్ని  ప్రారంభించాడు. అయితే... ‘హరియాణా వారి శరీరాలకు స్విమ్మింగ్‌ సరైన క్రీడ కాదు. రెజ్లింగ్, వెయిట్‌ లిఫ్టింగే మీకు తగినవి’ అన్న కోచ్‌ల మాటతో తన క్రీడాంశాన్ని మార్చుకున్నాడు. ఇప్పటికే అతి చిన్న వయసు (15)లో వెయిట్‌ లిఫ్టింగ్‌ 62 కేజీల విభాగంలో జాతీయ రికార్డు నెలకొల్పిన దీపక్‌... తొలిసారి పాల్గొంటున్న కామన్వెల్త్‌ క్రీడల్లోనే పతకం అందుకుకున్నాడు. పోటీ సందర్భంగా ‘అయోనే విఫలం కావాలని నేను కోరుకున్నా. అదే జరిగింది’ అంటూ పేర్కొన్న అతడు... పతకం అందుకుంటుండగా నమ్మలేనంత ఆశ్చర్యానికి గురయ్యాడు.

ఇతర క్రీడాంశాల్లో భారత ప్రదర్శన...
బ్యాడ్మింటన్‌: మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. స్కాట్లాండ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0తో గెలిచి గ్రూప్‌ ‘టాపర్‌’గా నిలిచింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో మారిషస్‌తో భారత్‌ తలపడుతుంది. 
బాక్సింగ్‌: పురుషుల 91 కేజీల విభాగంలో నమన్‌ తన్వర్‌ 5–0తో హరూనా మహాండో (టాంజానియా)పై; 48 కేజీల విభాగంలో అమిత్‌ 5–0తో సులేమాను (ఘనా)పై గెలిచారు. 
మహిళల హాకీ: మలేసియాతో జరిగిన పూల్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 4–1తో నెగ్గింది. 
స్క్వాష్‌: మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోగా... దీపిక పళ్లికల్‌ రెండో రౌండ్‌లో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హరీందర్, విక్రమ్‌  రెండో రౌండ్‌లో ఓటమి చెందారు. 
జిమ్నాస్టిక్స్‌: మహిళల ‘వాల్ట్‌’ ఈవెంట్‌లో ప్రణతి నాయక్‌... ఆల్‌ అరౌండ్‌ విభాగంలో ప్రణతి దాస్‌ ఫైనల్‌కు చేరారు. ఇటీవలే ప్రపంచకప్‌లో వాల్ట్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలిచిన తెలంగాణ జిమ్నాస్ట్‌ అరుణా రెడ్డి ఏ ఈవెంట్‌లోనూ ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement