బామ్మ అభిమానానికి కోహ్లి ఫిదా!

Virat Kohli and Rohit Sharma Meet 87 Year Old Super Fan - Sakshi

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయానంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌, సెంచరీ హీరో రోహిత్‌శర్మ ప్రేక్షకుల గ్యాలరీలోని ఓ అభిమానిని ప్రత్యేకంగా కలిసి ఆశీర్వాదాం తీసుకున్నారు. అంతేకాకుండా ఇలాంటి అభిమానిని ఎప్పుడూ ఎక్కడా చూడలేదని కెప్టెన్‌ కోహ్లి ట్వీట్‌ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ ప్రత్యేక అభిమాని ఎవరంటే 87 ఏళ్ల చారులత పటేల్‌. ఆటపై మక్కువ ఉంటే వయసుతో సంబంధంలేదని ఈ బామ్మ నిరూపించింది. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో చిన్నపిల్లలకు ఏమాత్రం తగ్గకుండా బూర ఊదుతూ ఆమె చూపించిన జోష్‌కు అటు ఆటగాళ్లు, ఇటు కామెంటేటర్లు ఫిదా అయ్యారు.  


మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుండగా.. చెంపలకు భారత జెండా స్టిక్కర్స్‌ వేసుకోని చేతిలో త్రివర్ణపతాకంతో ఈ బామ్మ టీమిండియాకు మద్దతు పలకడం ఆకట్టుకుంది. ఆమె హడావుడిని టీవీలో పదేపదే చూపించడం, అభిమానానికి వయసుతో సంబంధంలేదని కామెంటేటర్స్‌ కొనియాడటం టీవీ ప్రేక్షకులను రంజింప చేసింది. బామ్మ అభిమానానికి ముగ్ధులైన రోహిత్‌, కోహ్లిలు ఆమెను ప్రత్యేకంగా కలిసారు. కెప్టెన్‌ కోహ్లి ఆమెతో ఉన్న ఫొటోలను ట్విటర్‌లో పంచుకుంటూ.. ‘మాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు అభిమానులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చారులతా గారికి స్పెషల్‌ థ్యాంక్స్‌. ఆమె వయసు 87 ఏళ్లు. క్రికెట్‌ పట్ల ఇంత పిచ్చి, అంకితభావం ఉన్న ఆమెలాంటి అభిమానిని నేను ఇంతవరకు చూడలేదు. వయసు ఒక సంఖ్య మాత్రమేనని, అభిరుచి అనేది ఎక్కడికైనా తీసుకెళ్తుందని ఆమె ద్వారా తెలుస్తోంది. తదుపరి మ్యాచ్‌కు ఆమె ఆశీర్వదాం తీసుకున్నాను’  అని క్యాఫ్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 1983లో కపిల్‌ డెవిల్స్‌ లార్డ్స్‌లో ప్రపంచ కప్‌ గెలిచినప్పుడు అక్కడే ఉన్నానని చెప్పిన ‘ఫ్యాన్‌ ఆఫ్‌ ద డే’... మ్యాచ్‌ తర్వాత తన వద్దకు అభిమానంతో వచ్చిన కోహ్లి, రోహిత్‌లపై ఆప్యాయత కురిపిస్తూ భారత్‌ మళ్లీ టైటిల్‌ గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేసింది. 

(చదవండి: విజయం అదిరె...)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top