వినయ్‌కుమార్‌ హ్యాట్రిక్‌

Vinayakumar hat trick - Sakshi

నాగ్‌పూర్‌: రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌లో ముంబై జట్టు తడబడింది. కర్ణాటక పేసర్‌ వినయ్‌కుమార్‌ ‘హ్యాట్రిక్‌’ సహా ఆరు వికెట్లతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే ఆలౌటైంది. వినయ్‌ కుమార్‌ (6/34) దెబ్బకు 74/7తో కష్టాల్లో పడ్డ ముంబై జట్టును లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ధావల్‌ కులకర్ణి (132 బంతుల్లో 75; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు. వినయ్‌ వేసిన తొలి ఓవర్‌ చివరి బంతికి పృథ్వీ షా (2) స్లిప్‌లో కరుణ్‌ నాయర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగ్గా... మూడో ఓవర్‌ తొలి బంతికి జయ్‌ గోకుల్‌ బిస్తా (1), రెండో బంతికి ఆకాశ్‌ పర్కర్‌ (0)లను వెనక్కి పంపడంతో కర్ణాటక కెప్టెన్‌ హ్యాట్రిక్‌ పూర్తయింది. సిద్ధేశ్‌ లాడ్‌ (8), సూర్యకుమార్‌ యాదవ్‌ (14), తారే (4) విఫలమయ్యారు. అనంతరం ఇన్నింగ్స్‌ ఆరంభించిన కర్ణాటక తొలి రోజు ఆట ముగిసే సమయానికి సమర్థ్‌ (40) వికెట్‌ కోల్పోయి 115 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్‌ అగర్వాల్‌ (62 బ్యాటింగ్‌), అబ్బాస్‌ (12 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. కర్ణాటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో మరో 58 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది.

మధ్యప్రదేశ్‌ 223/6
 సాక్షి, విజయవాడ: ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ మ్యాచ్‌లో తొలి రోజు మధ్యప్రదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్‌ అంకిత్‌ దానే (59), సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ నమన్‌ ఓజా (49) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్‌ వికాస్‌ మిశ్రా (3/40) ఆకట్టుకున్నాడు.

జైపూర్‌ బెంగాల్, గుజరాత్‌ల మధ్య జరుగుతున్న  మరో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బెంగాల్‌ ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (129) సెంచరీతో ఆకట్టుకోగా, అనుస్తుప్‌ మజుందార్‌ (94) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వీరి ఆటతో ఆ జట్టు 6 వికెట్లకు 261
పరుగులు చేసింది.  

సూరత్‌: మరో క్వార్టర్‌ ఫైనల్‌లో విదర్భ, కేరళ మధ్య మ్యాచ్‌ తొలి రోజు కేవలం 24 ఓవర్ల ఆట మాత్రమే సాగింది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ జట్టు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 45 పరుగులు చేసింది.  ముంబై 173 ఆలౌట్‌ ∙రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top