
దీటుగా బదులిస్తున్నవిరాట్ సేన
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ దీటుగా బదులిస్తోంది.
ముంబై: ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ దీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ 52.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. మురళీ విజయ్(70 బ్యాటింగ్;169 బంతుల్లో6 ఫోర్లు, 2 సిక్సర్లు), చటేశ్వర పూజారా(47 బ్యాటింగ్;102 బంతుల్లో 6 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు.
తొలుత ఇంగ్లండ్ను 400 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. ఆ తరువాత మొదటి ఇన్నింగ్స్ను ఆరంభించింది. భారత ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్తో కలిసి మురళీ విజయ్ ప్రారంభించాడు.కాగా, రాహుల్(24) తొలి వికెట్ గా అవుటయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత విజయ్తో కలిసిన చటేశ్వర పూజారా ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు. ఈ క్రమంలోనే విజయ్ 126 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అర్థ శతకం సాధించాడు. ఇది విజయ్ కెరీర్లో 15వ హాఫ్ సెంచరీ.
అంతకుముందు 88/5 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 112 పరుగులు జత చేసింది. ఓవర్ నైట్ ఆటగాడు బెన్ స్టోక్స్(31)ను తొందరగానే పెవిలియన్ కు పంపినా, మరో ఓవర్ నైట్ ఆటగాడు జాస్ బట్లర్(76) చివరి వికెట్గా అవుటయ్యాడు. ప్రతీ ఆటగాడితో ఎంతో కొంత భాగస్వామ్యం నెలకొల్పతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ప్రధానంగా జాక్ బాల్(31)తో కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే బట్లర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే లంచ్ తరువాత బట్లర్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నాల్గొందల మార్కును చేరింది. కాగా, జడేజా బౌలింగ్లో భారీ షాట్ కు యత్నించిన బట్లర్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు సాధించగా, జడేజా నాలుగు వికెట్లు తీశాడు.