‘సొహైల్‌.. నా రక్తం మరిగేలా చేశాడు’ | Sakshi
Sakshi News home page

‘సొహైల్‌.. నా రక్తం మరిగేలా చేశాడు’

Published Fri, Jun 12 2020 5:17 PM

Venkatesh Prasad On The Aamer Sohail Incident - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా-పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్ల సమరం అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు జట్లు తలపడిన ప్రతీ సందర్భంలోనూ ఇరు జట్ల ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై ప్రధాన ఫోకస్‌ ఉంటుంది. అది వరల్డ్‌కప్‌ అయితే ఇక ఆ సమరమే వేరు. అలా ఇరు జట్లు తలపడిన వరల్డ్‌కప్‌ సమరాల్లోని బెస్ట్‌ మూమెంట్స్‌లో 1996 వరల్డ్‌కప్‌ ఒకటి. పాకిస్తాన్‌తో జరిగిన ఆనాటి క్వార్టర్‌ ఫైనల్లో అమిర్‌ సొహైల్‌-వెంకటేశ్‌ ప్రసాద్‌ల పోరు ప్రత్యేకం. వెంకటేశ్‌ ప్రసాద్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన సొహైల్‌.. ప్రతీ బంతిని ఇలానే కొడతానని, వెళ్లి తెచ్చుకో అంటూ బ్యాట్‌తో సంకేతాలివ్వగా, ఆ మరుసటి బంతికే వెంకటేశ్‌ ప్రసాద్‌ బౌల్డ్‌ చేయడం భారత అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ను తీసుకొచ్చిందనేది వాస్తవం.(ఇక మా పని అయిపోయినట్లే: ఇషాంత్‌)

అమిర్‌ ఔట్‌ కాగానే ఇక ‘నువ్వు పెవిలియన్‌కు వెళ్లు’ అనే అర్థం వచ్చేలా వెంకటేశ్‌ ప్రసాద్‌ చేయి చూపించడం ఇప్పటికీ హైలైట్‌. ఇదే విషయాన్ని తాజాగా వెంకటేశ్‌ ప్రసాద్‌ గుర్తు చేసుకున్నాడు. 24 ఏళ్ల క్రితం జరిగిన ఆ మ్యాచ్‌లో సొహైల్‌ తనను రక్తం మరిగేలా చేశాడన్నాడు. నా బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన తర్వాత సొహైల్‌ తీరు సరిగ్గా లేదు. సంజ్ఞ చేసిన తర్వాత వాగ్వాదానికి దిగే యత్నం చేశాడు. ఆ ఫోర్‌ కొట్టిన పిదప క్రీజ్‌లోకి వెళ్లాలి. కానీ ఇంకా ఏదో రెచ్చగొట్టే యత్నం చేశాడు. దాన్ని దేశం మొత్తం చూసింది. అది నా రక్తం మరిగేలా చేసింది. ఇంకా ఆ వికెట్ ఎంతో అవసరం కూడా. దాంతో తదుపరి బంతిని లైన్‌ లెంగ్త్‌లో వేయగా సొహైల్‌ ఆవేశపడి వికెట్‌ సమర్పించుకున్నాడు. దాంతో నాకు కూడా ఆవేశం వచ్చింది. సొహైల్‌ పెవిలియన్‌కు వెళుతున్న క్రమంలో నేను కూడా అదే తరహా సంజ్ఞతో వీడ్కోలు చెప్పా. ఏదో అనబోయి కాస్త కంట్రోల్‌లోకి వచ్చేశా. ఆ సమయంలో జవగళ్ శ్రీనాథ్‌, సచిన్‌ టెండూల్కర్‌, అజహర్‌ తదితరులు నా వద్దకు వచ్చి నన్ను రక్షించారనే చెప్పాలి. లేకపోతే నాకు భారీ జరిమానానే కాకుండా నిషేధం కూడా చూడాల్సి వచ్చేదేమో. అప్పుడు షెఫర్డ్‌ అంపైర్‌గా ఉన్నారు’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ మరొకసారి క్రికెట్‌ అభిమానుల ముందుకు తెచ్చాడు.(‘యువీ.. నువ్వు ఇంకా ఆడతావనుకున్నా’)

Advertisement
Advertisement