ఒలింపిక్స్‌ ఇక 2021లోనే! 

Tokyo Olympics May Postpone Due To Coronavirus - Sakshi

ఒలింపిక్స్‌ వాయిదాపై ఆస్ట్రేలియా తొలి అడుగు

వచ్చే ఏడాది కోసమే సిద్ధం కావాలని తమ అథ్లెట్లకు పిలుపు

ఈ సంవత్సరంలో జరిగితే పాల్గొనబోమన్న కెనడా

టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై మరిన్ని సందేహాలు

టోక్యో ఒలింపిక్స్‌ అనుకున్న సమయానికే జరుగుతాయి. వాయిదా వేయాల్సి వస్తుందేమో..! పూర్తిగా రద్దు కావచ్చు కూడా! పరిస్థితులు చక్కబడతాయన్న నమ్మకం ఉంది! కచ్చితంగా నిర్వహించి తీరతాం. మాకు ఎలాంటి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఏర్పాట్లు మాత్రం చురుగ్గా కొనసాగుతున్నాయి. 2020 ఒలింపిక్స్‌ గురించి గత కొన్ని రోజులుగా   వచ్చిన వేర్వేరు వ్యాఖ్యలు, వార్తలు ఇవి.

జపాన్‌ ప్రభుత్వం, నిర్వహణ కమిటీ ఒక్కో రోజు ఒక్కో రకమైన స్పందనతో ముందుకు రావడం, ఆపై గందరగోళం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక్క దేశం కూడా ఒలింపిక్స్‌పై తమ వైఖరి ఏమిటో ఇంత కాలం చెప్పలేదు. కానీ దీనిపై అగ్రదేశం ఆస్ట్రేలియా తొలి అడుగు వేసింది. ఈ ఏడాది మెగా ఈవెంట్‌ జరగడం అసాధ్యమని, తాము పాల్గొనలేమని అందరికంటే ముందుగా తేల్చేసింది. ఇక దీనిపై స్పందించాల్సిన స్థితిలో ఇతర సభ్య దేశాలకూ  మార్గం చూపించింది.

సిడ్నీ: కోవిడ్‌–19 ఉత్పాతం ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ఒలింపిక్‌ కమిటీ (ఏఓసీ) కీలక నిర్ణయం తీసుకుంది. టోక్యోలో జరగాల్సిన 2020 ఒలింపిక్స్‌ గురించి ఏడాది పాటు మరిచిపోవాలని తమ దేశ అథ్లెట్లకు తేల్చి చెప్పింది. 2021లో ఇవి నిర్వహించే అవకాశం ఉందని, దాని కోసమే ఇకపై సిద్ధం కావాలని స్పష్టం చేసింది. సోమవారం ఆస్ట్రేలియా ఒలింపిక్‌ కమిటీ ప్రత్యేక బోర్డు సమావేశం జరిగింది. ఇందులో క్రీడల నిర్వహణకు సంబంధించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ‘ఈ ఏడాది జూలైలో ఒలింపిక్స్‌ జరగవనేది మాత్రం ఖాయమైపోయింది. ఆటపరంగా మా క్రీడాకారులు అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నారు. అయితే మానసికంగా మాత్రం వారి స్థితి గందరగోళంగా మారింది.

ప్రస్తుతం మా దేశం, ఇతర దేశాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జట్టు మొత్తం ఒకే చోట చేరడం సాధ్యం కాదు. వారంతా వేర్వేరు ప్రాంతాల్లో ప్రస్తుతం సాధన చేస్తున్నారు. ఉన్న చోటి నుంచి కనీసం కదిలే పరిస్థితి కూడా లేదు. అందుకే వచ్చే ఏడాది కోసమే సిద్ధం కావాలని మా అథ్లెట్లకు సమాచారం ఇచ్చాం’ అని ఏఓసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మాట్‌ క్యారల్‌ ప్రకటించారు. ఒలింపిక్స్‌ను సంవత్సరం పాటు వాయిదా వేయడం వల్ల అన్ని రకాల ఆందోళనలను అధిగమించి ఆటగాళ్లు కూడా ప్రశాంతంగా సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంద న్నారు. ఒలింపిక్స్‌ వాయిదా వేయడం చిన్న విషయమేమీ కాదనే అంశం తమకు తెలుసని, అయితే అన్ని ప్రపంచ దేశాలు పాల్గొంటేనే ఒలింపిక్స్‌కు విలువ ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని క్యారల్‌ స్పష్టం చేశారు.

కెనడా కూడా...
కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను చూసి 2020 ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని కెనడా ఒలింపిక్‌ కమిటీ (సీఓసీ) విజ్ఞప్తి చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది జూలై–ఆగస్టులలోనే ఒలింపిక్స్‌ను నిర్వహించాలని ప్రయత్నిస్తే తమ దేశం నుంచి ఆటగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించబోమని సీఓసీ స్పష్టం చేసింది. మరో నాలుగు వారాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఐఓసీ ప్రకటిస్తున్నా... అంత కాలం ఆగే ఓపిక తమకు లేదని, ఏడాది పాటు వాయిదా పడితేనే ఘనంగా నిర్వహించేందుకు తమ సహకారం అందిస్తామని కూడా కెనడా తేల్చి చెప్పింది. ‘ఇది ఒక్క అథ్లెట్ల ఆరోగ్య సమస్య మాత్రమే కాదు. ప్రపంచ సమస్య. కోవిడ్‌–19 విజృంభిస్తున్న సమయంలో మా ఆటగాళ్లు, వారి కుటుంబాలని, కెనడా సమాజాన్ని పణంగా పెట్టలేం. కరోనా నుంచి రక్షించుకోవడం ఎలాగో మేం దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే ఒలింపిక్స్‌ వ్యవహారం అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది’ అని కెనడా ఒలింపిక్‌ కమిటీ అభిప్రాయ పడింది.

జపాన్‌ ప్రధాని నోట వాయిదా మాట 
టోక్యో: కరోనా కారణంగా ఒలింపిక్స్‌ వాయిదా వేయడానికి సంబంధించి తొలిసారి జపాన్‌ ప్రభుత్వం నుంచి కీలక వ్యాఖ్య వినిపించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వాయిదా తప్పకపోవచ్చని స్వయంగా జపాన్‌ దేశ ప్రధాని షింజో అబె ప్రకటించారు. ‘ఒలింపిక్స్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతే వాటిని వాయిదా వేయడమే మంచిది. అథ్లెట్ల ఆరోగ్య భద్రత అన్నింటికంటే ప్రధానం కాబట్టి వాయిదా తప్పకపోవచ్చు’ అని అబె అన్నారు. ఒక వేళ వాయిదా తప్పదనుకుంటే ఐఓసీ ఆ నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని... వాయిదాతో ముడిపడిన అనేక సమస్యలను పరిష్కరించుకునేందుకు తగినంత సమయం ఉండాలని కూడా ఆయన సూచించారు. అయితే ఒలింపిక్స్‌ రద్దయ్యే అవకాశం ఏమాత్రం లేదని షింజో పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పారు. ఆదివారం నాటికి జపాన్‌లో కరోనా కేసుల సంఖ్య 1719కి చేరగా, 43 మరణాలు సంభవించాయి.

నాలుగు వారాల్లో నిర్ణయం!
ఒలింపిక్స్‌–2020పై పైకి ఎంత గాంభీర్యం ప్రదర్శిస్తున్నా... దాని నిర్వహణపై స్వయంగా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కే సందేహాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాగైనా జరుపుతామని చెబుతూ వచ్చిన ఐఓసీ కాస్త వెనక్కి తగ్గింది. సభ్య దేశాలన్నింటి నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో నిర్వాహకులపై ఒత్తిడి పెరిగింది. దాంతో దీనిపై కొంత వివరణ ఇస్తూ తమకు తాము నెల రోజుల గడువు విధించుకుంది. ‘రాబో యే నాలుగు వారాల్లోపు ఒలింపిక్స్‌ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటాం. క్రీడలకంటే ప్రజల ప్రాణాలు అమూల్యమైనవి. ప్రత్యామ్నాయాల గురించి గత కొద్ది రోజులుగా మేం చర్చిస్తూనే ఉన్నాం. అందులో ఒలింపిక్స్‌ వాయిదా వేయడం కూడా ఒకటి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీడల రద్దు మాత్రం ఉండదు’ అని క్రీడాకారులనుద్దేశించి రాసిన బహిరంగ లేఖలో ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ ప్రకటించారు. మరోవైపు షెడ్యూల్‌ ప్రకారం ఒలింపిక్స్‌ జరగవనే విషయం ఇప్పటికే అందరికీ అర్థమైపోయిందని, కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు వాయిదా వేయడమే మంచిదని ఫ్రెంచ్‌ అథ్లెటిక్స్‌ సమాఖ్య అభిప్రాయపడింది.

మేమూ నెల రోజులు వేచి చూస్తాం...
ప్రస్తుతం ఐఓసీతో కలిసి భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఇలాంటి దశలో వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. కనీసం వచ్చే నెల రోజుల పాటు వేచి చూస్తాం. ఆ తర్వాతే టోక్యో ఒలింపిక్స్‌కు మన అథ్లెట్లను పంపాలా వద్దా అనే అంశంపై ఆలోచిస్తాం. ఐఓసీతో పాటు భారత క్రీడా మంత్రిత్వ శాఖతో కూడా చర్చించిన తర్వాత మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం. ఇతర దేశాలతో పోలిస్తే మన వద్ద పరిస్థితి అంత ఘోరంగా ఏమీ లేదు. –రాజీవ్‌ మెహతా, ప్రధాన కార్యదర్శి, ఐఓఏ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top