సామ్సన్‌ విఫలం.. శ్రీలంకకు భారీ టార్గెట్‌

 Team India Set Target Of 202 Runs Against Srilanka - Sakshi

పుణె: శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో టీమిండియా 202 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(52), కేఎల్‌ రాహుల్‌(54)లు శుభారంభాన్ని ఇస్తే,  మనీష్‌ పాండే(31 నాటౌట్‌; 18 బంతుల్లో 4 ఫోర్లు), శార్దూల్‌ ఠాకూర్‌(22 నాటౌట్‌;8 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) సమయోచితంగా ఆడారు. దాంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది.

శ్రీలంక టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. భారత్‌ బ్యాటింగ్‌ను ధావన్‌-కేఎల్‌  రాహుల్‌లు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ పోటీ పడి పరుగులు తీశారు. ఓ దశలో ధావన్‌ చెలరేగి ఆడాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు ధావన్‌. కాగా, ధావన్‌ 52 వ్యక్తిగత పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.  సందకాన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి ధావన్‌ పెవిలియన్‌ చేరాడు.(ఇక‍్కడ చదవండి: సామ్సన్‌ చాలా మిస్సయ్యాడు..!)

సామ్సన్‌ విఫలం..
సుదీర్ఘ విరామం తర్వాత రెండో టీ20 ఆడుతున్న సంజూ సామ్సన్‌(6) నిరాశపరిచాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. వచ్చీ రావడంతోనే తొలి బంతినే సిక్స్‌ కొట్టిన సామ్సన్‌ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. తన ఆడిన రెండో బంతికి ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. హసరంగా బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. ఇక రాహుల్‌(54) హాఫ్‌ సెంచరీ సాధించి మూడో వికెట్‌గా ఔట్‌ కాగా, కాసేపటికి అయ్యర్‌(4) సైతం విఫమయ్యాడు. సందకాన్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(26;17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్‌ అయ్యాడు. చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌-మనీష్‌ పాండేల జోడి బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. వీరిద్దరూ  కలిసి చివరి ఓవర్‌లో 19 పరుగులు సాధించడంతో భారత స్కోరు రెండొందలు దాటింది. లంక బౌలర్లలో సందకాన్‌ మూడు వికెట్లు సాధించగా, లహిరు కుమార, హసరంగాలు తలో వికెట్‌ తీశారు.( ఇక్కడ చదవండి: ధావన్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top