బ్యాట్స్‌మెన్‌పైనే భారం

Sunil Gavaskar feels this youngster can play in the third Test against England - Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

భారత సీమర్లు బాధ్యతగా బౌలింగ్‌ చేశారు.  రెండో టెస్టులో జట్టు పుంజుకునేందుకు తమ వంతు కృషి చేశారు. లార్డ్స్‌లో మూడో రోజు పరిస్థితులు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి స్థితిలోనూ భారత బౌలర్లు స్వింగ్‌తో ఫలితాలను రాబట్టారు. సొంతగడ్డపై ఇంగ్లిష్‌ బౌలర్లంత కాకపోయినా తమ సామర్థ్యం మేరకు పిచ్‌పై తమ ప్రతాపాన్ని చూపెట్టారు. ఇషాంత్‌ శర్మ అద్భుతమైన డెలివరీతో అనుభవజ్ఞుడైన కుక్‌ వికెట్‌ పడగొడితే... మొహహ్మద్‌ షమీ అసాధారణ బంతితో రూట్‌ ఆట ముగించాడు. హార్దిక్‌ పాండ్యా కూడా ఓ చేయివేశాడు. బౌన్సర్ల జోలికి వెళ్లకుండా వైవిధ్యమైన బంతులతో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. పిచ్‌ నుంచి సహకారం లభించినప్పటికీ పాండ్యా తన సామర్థ్యాన్నే నమ్ముకున్నాడు. తొలి టెస్టులో బ్యాటింగ్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న భారత్‌ ఈ మ్యాచ్‌లో కళ్లు తెరిచింది. ఫామ్‌లో లేని ధావన్‌ను పక్కనబెట్టి టెస్టు స్పెషలిస్ట్‌ పుజారాను దించింది.

అలాగే స్పిన్నర్‌ కుల్దీప్‌కు అవకాశమిచ్చింది. ఈ మణికట్టు బౌలర్‌ వన్డేల్లో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ను వణికించినట్లే ఈ టెస్టులోనూ రాణిస్తాడేమో చూడాలి. అండర్సన్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. స్వదేశీ పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకున్న తీరు అమోఘం. అతడు సంధించిన కొన్ని ఔట్‌ స్వింగర్లు వేగంగా వచ్చే లెగ్‌బ్రేక్‌లను తలపించాయి. ఇవి కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వ కుండా దెబ్బతీస్తాయి. అతనికి వోక్స్‌ చక్కగా తోడ్పాటునిచ్చాడు. మరో ఎండ్‌ నుంచి వోక్స్‌ కూడా భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించే బంతుల్నే సంధించాడు. ఇతని దూకుడుతో స్టోక్స్‌ లేని లోటే కనపడలేదు. కరన్‌ తక్కువేం తినలేదు. అతనూ బాగా బౌలింగ్‌ చేశాడు. అక్కడి వాతావరణ పరిస్థితులు భారత బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో చురుగ్గా స్పందించకుండా చేశాయి. చూస్తుంటే భారత్‌కు ఈ మ్యాచ్‌ క్లిష్టమైన సవాల్‌ విసురుతోంది. అయితే భారత బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోరు సాధించి మొదటి టెస్టులాగే ఆతిథ్య జట్టుకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే పరిస్థితుల్లో మార్పురావొచ్చు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top