ఐపీఎల్‌: వార్నర్‌ స్థానంలో హేల్స్‌!

 SRH replace David Warner with Alex Hales - Sakshi

హైదరాబాద్‌ : ట్యాంపరింగ్‌ వివాదంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌కు ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార‍్నర్‌ దూరమైన విషయం తెలిసిందే. దీంతో వార్నర్‌ స్థానంలో ఇంగ్లండ్‌ ఓపెనర్ అలెక్స్‌ హేల్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎంపిక చేసుకుంది. అతని కనీస ధర కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితా నుంచి సన్‌రైజర్స్‌ హేల్స్‌ను ఎంపిక చేసుకున్నట్లు బీసీసీఐ శనివారం ప్రకటించింది.

ఈ ఇంగ్లండ్‌ ఓపెనర్‌పై ఈసారి జరిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. అయితే హేల్స్‌ టీ20 కెరీర్‌ ఫర్వాలేదు. 52 అంతర్జాతీయ టీ20ల్లో 31.65 సగటుతో 1456 పరుగులు చేశాడు. 2015 ఐపీఎల్‌లో కోరె అండర్స్‌న్‌ గాయంతో దూరం అవ్వడంతో అతని స్థానంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లపై ఏడాది పాటు నిషేదం విధిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కూడా స్మిత్‌, వార్నర్‌లను ఈ ఏడాది ఐపీఎల్‌కు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వీరి స్థానాల్లో వేరే ఆటగాళ్లను తీసుకోవాలని ఫ్రాంచైజీలకు సూచించింది.  

వార్నర్‌ను భర్తీ చేయడం కష్టమే.!
వార్నర్‌ లేని సన్‌రైజర్స్‌ను ఊహించుకోవడం హైదరాబాద్‌ అభిమానులకు కష్టంగా ఉంది. వార్నర్‌ ఆట ఒక ఎత్తు అయితే మిగతా జట్టంతా ఒకవైపు. 2014లో 528 పరుగులు ...2015లో 562...2016లో 848...2017లో 641...సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున గత నాలుగు సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌ ప్రదర్శన ఇది. ఒంటి చేత్తో అతను మ్యాచ్‌లు గెలిపించాడు.  2014 నుంచి 59 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 52.63 సగటు, 147.71 స్ట్రైక్‌ రేట్‌తో 2,579 పరుగులు చేశాడు. ఇందులో 26 అర్ధ శతకాలు, ఒక శతకం ఉన్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top