ఖేల్‌ ఖతమ్‌... 

Sports Festivals That Are Going Down Due To Corona - Sakshi

‘కరోనా’ కారణంగా కుదేలవుతున్న క్రీడా సంబరాల జాబితా చూస్తే... 

►భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 15, 18 తేదీల్లో రెండో, మూడో వన్డే జరగాల్సి ఉంది. లక్నో, కోల్‌కతాలో జరిగే ఈ మ్యాచ్‌లకు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించరాదని బీసీసీఐ నిర్ణయించింది. టికెట్ల అమ్మకాలు నిలిపివేశారు.  
►ముంబైలో సచిన్, లారా తదితర మాజీ క్రికెటర్లతో జరుగుతున్న రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టోర్నీ కూడా రద్దయింది. ముందుగా ప్రేక్షకులు లేకుండా ఆడించాలని భావించినా...చివరకు నిర్వాహకులు రద్దుకే మొగ్గు చూపారు.  
►రాజ్‌కోట్‌లో బెంగాల్, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌ చివరి రోజైన నేడు మైదానంలో ప్రేక్షకులకు ప్రవేశం లేదు.  
►ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీని ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తామని భారత్‌ బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) బుధవారం ప్రకటించినా... కేంద్ర ప్రభుత్వ తాజా వీసా నిబంధనలతో విదేశీ ఆటగాళ్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో టోర్నీ నిర్వహణ కూడా సందేహమే.  
►ప్రపంచంలోనే అతి పెద్ద, అమెరికాలోని ప్రతిష్టాత్మక నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) లీగ్‌ ఈ సీజన్‌కు సంబంధించి మ్యాచ్‌లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం అతి పెద్ద నిర్ణయం.  
►ప్రతిష్టాత్మక ఫార్ములా 1 సీజన్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరగాల్సిన తొలి గ్రాండ్‌ప్రి రద్దయింది. ముందుగా మెక్లారెన్‌ జట్టు సభ్యుడొకరు కరోనా బారిన పడటంతో ఆ జట్టు మాత్రమే తప్పుకునేందుకు సిద్ధమైనా... ఇతర జట్ల ఒత్తిడితో నిర్వాహకులు మొత్తంగా రద్దు చేసేశారు.  
►చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య ఈ శనివారం గోవాలో జరగాల్సిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించడం లేదు.  
►భారత దేశవాళీ ఫుట్‌బాల్‌ టోర్నీ ఐ లీగ్‌లో జరగాల్సిన 28 మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తారు.  
►ప్రఖ్యాత స్పానిష్‌ లీగ్‌ ‘లా లిగా’ మ్యాచ్‌లు రద్దయ్యాయి. దాంతో రియల్‌ మాడ్రిడ్‌ ఫుట్‌బాల్‌ జట్టు సభ్యులు బయటకు రాకుండా  స్వచ్ఛందంగా ప్రత్యేక వైద్యు ల పర్యవేక్షణలోకి వెళ్లిపోయారు. రియల్‌ మాడ్రిడ్‌కే చెందిన బాస్కెట్‌ బాల్‌ జట్టు ఆటగాడు ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఈ రెండు జట్లకు ఒకే చోట వసతి ఏర్పాట్లు ఉన్నాయి.  
►ఖతార్‌లో మార్చి 26నుంచి జరగాల్సిన యూరో 2020 వార్మప్‌ టోర్నీ రద్దయింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖతార్‌లోనే త్వరలో నిర్వహించాల్సిన వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లను వాయిదా వేయాలని దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ బాడీ (కాన్‌మెబాల్‌) ‘ఫిఫా’కు విజ్ఞప్తి చేసింది.  
►జోర్డాన్‌లో ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆడి భారత్‌కు తిరిగి వస్తున్న మన బాక్సర్లందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు వెళ్లరాదని భారత బాక్సింగ్‌ సమాఖ్య ఆదేశించింది.  
►కరోనా కారణంగానే ఈనెల 16 నుంచి జరగాల్సిన టాలెంట్‌ సిరీస్, చాంపియన్‌షిప్‌ సిరీస్, సూపర్‌ సిరీస్, నేషనల్‌ సిరీస్, ‘ఐటా’ పురుషుల, మహిళల ఈవెంట్‌లను రద్దు చేస్తున్నట్లు అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ప్రకటించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top