తొలి వన్డేలో భారత్‌ విజయం | Spinners, Mandhana help India beats england | Sakshi
Sakshi News home page

తొలి వన్డేలో భారత్‌ విజయం

Apr 6 2018 4:31 PM | Updated on Apr 6 2018 4:31 PM

Spinners, Mandhana help India beats england - Sakshi

నాగ్‌పూర్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్‌ మహిళలతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్‌ మహిళలు వికెట్‌ తేడాతో విజయం సాధించి శుభారంభం చేశారు. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 49.1 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత క్రీడాకారిణుల్లో స్మృతీ మంధాన(86;109 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించి విజయంలో ప్రధాన భూమిక పోషించింది.  స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ 41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ మంధాన సమయోచితంగా బ్యాటింగ్‌ చేసింది. ఆమెకు జతగా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(21), దీప్తి శర్మ(24)లు మోస్తరుగా ఆడి విజయానికి సహకరించారు.

అంతకముందు ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి  49. 3 ఓవర్లలో 207 పరుగులు చేసింది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ జట్టులో డానియల్లీ వ్యాట్‌(27), బీమౌంట్‌(37), నటాలీ స్కీవర్‌(21), డానియెల్లీ హజెల్‌(33)లు ఫర‍్వాలేదనిపించగా, ఫ్రాన్‌ విల్సన్‌(45) ఆకట్టుకుంది.తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఇంగ్లండ్‌ పదిహేను పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. ఆపై ఫ్రాన్‌ విల్సన్‌ బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసి ఇంగ్లండ్‌ను ఆదుకుంది. చివర్లో తొమ్మిదో వరుస బ్యాట్స్‌వుమన్‌ హజెల్‌ కుదురుగా బ్యాటింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ రెండొందల పరుగుల మార్కును దాటింది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు, ఏక్తా బిస్త్‌ మూడు వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించగా, దీప్తి శర్మకు రెండు వికెట్లు, జులన్‌ గోస్వామి వికెట్‌ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement