
చివరి టెస్టులో ఫలితం వచ్చేనా?
ఈ సిరీస్ లో ఇప్పటివరకూ నిలకడలేమితో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అందుకు భిన్నంగా ఆడుతోంది.
ఢిల్లీ: ఈ సిరీస్ లో ఇప్పటివరకూ నిలకడలేమితో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అందుకు భిన్నంగా ఆడుతోంది. టీమిండియా విసిరిన భారీ విజయలక్ష్యాన్నిచూసి భయపడ్డారో?లేక అనవసర రిస్క్ ఎందుకులే అనుకున్నారో కానీ సఫారీలు నిలకడగా ఆడుతున్నారు. దీంతో నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి 72.0 ఓవర్లలో సఫారీలు రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 72 పరుగులు చేశారు.
నాల్గో టెస్టులో 481 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన సఫారీలు డ్రా కోసం ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. సఫారీలు ఆదిలో ఎల్గర్(4) వికెట్ కోల్పోయి తడబడినట్లు కనిపించినా.. ఆ తరువాత హషీమ్ ఆమ్లా, భావుమా జోడి ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో కుదుటపడింది. అయితే టీ విరామం తరువాత కొద్ది సేపటికి భావుమా(34) పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా రెండో వికెట్ ను కోల్పోయింది. ఆ తరుణంలో అప్పటికే క్రీజ్ లో పాతుకుపోయిన ఆమ్లాకు ఏబీ డివిలియర్స్ జత కలిశాడు. వీరి జోడి టీమిండియా బౌలర్లకు పరీక్షగా నిలిచింది. ఈ జోడిని విడగొట్టడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పదే పదే బౌలర్లను మార్చినా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆమ్లా(23 బ్యాటింగ్;207బంతుల్లో 3 ఫోర్లు), డివిలియర్స్(11 బ్యాటింగ్; 91 బంతుల్లో 1 ఫోర్) సుదీర్ఘంగా క్రీజ్ లో నిలబడటంతో దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. దక్షిణాఫ్రికా కోల్పోయిన రెండు వికెట్లు రవి చంద్రన్ అశ్విన్ ఖాతాలోనే చేరాయి.
అంతకుముందు 190/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 100.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. ఈ రోజు ఆటలో విరాట్ కోహ్లి(88) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినా.. అజింక్యా రహానే మరో శతకాన్ని సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి సఫారీలకు చుక్కలు చూపించిన రహానే.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే తరహాలో బ్యాటింగ్ చేసి మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. రహానే సెంచరీ చేసిన పిదప టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
ఇంకా సోమవారం ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో సిరీస్ ను ఘనంగా ముగించాలన్నటీమిండియా ఆశలకు గండి పడేలా ఉంది. దక్షిణాఫ్రికా విజయం సాధించడానికి 409 పరుగులు అవసరం కాగా, టీమిండియా గెలుపుకు ఎనిమిది వికెట్లు అవసరం. ఈ మ్యాచ్ లో ఫలితం తేలాలాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.