తుది పోరుకు ‘సై’రెనా | Serena Williams and Simona Halep Advance to Wimbledon Final | Sakshi
Sakshi News home page

తుది పోరుకు ‘సై’రెనా

Jul 12 2019 4:40 AM | Updated on Sep 18 2019 2:58 PM

Serena Williams and Simona Halep Advance to Wimbledon Final - Sakshi

సెరెనా, హలెప్‌

లండన్‌ : టెన్నిస్‌ దిగ్గజ మహిళా క్రీడాకారిణి మార్గరెట్‌ కోర్ట్‌(ఆస్ట్రేలియా) అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ రికార్డుకు అడుగు దూరంలో సెరెనా విలియమ్స్‌ నిలిచింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీ మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్‌ 11వ సారి ఫైనల్‌ చేరింది. గురువారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో 11వ సీడ్‌ సెరెనా 6–1, 6–2తో అన్‌సీడెడ్‌ బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించి హలెప్‌తో జరిగే టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. మరో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో రుమేనియా తార 7వ సీడ్‌ హలెప్‌ 6–1, 6–3తో 8వ సీడ్‌ స్వితోలినా(ఉక్రెయిన్‌)పై వరుస సెట్లల్లో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది.

ఫోర్‌ హ్యాండ్‌ షాట్లతో హోరెత్తించి..
హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగిన సెరెనా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆడింది. తనదైన ఫోర్‌ హ్యాం డ్‌ షాట్‌లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. సెరెనా ఫోర్‌ హ్యాండ్‌ షాట్‌లకు స్ట్రికోవా దగ్గర ఎటువంటి సమాధానం లేకపోవడంతో మొదటి సెట్‌ను 27 నిమిషాల్లో, రెండో సెట్‌ను 22 నిమిషాల్లో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో సెరెనా 28 విన్నర్లను, 4 ఏస్‌లను కొట్టగా.. స్ట్రికోవా కేవలం 8 విన్నర్లను, ఒక ఏస్‌ను మాత్రమే కొట్టింది.

తొలిసారి..
 2018 ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత హలెప్‌ తన కెరీర్‌లోనే తొలిసారిగా వింబుల్డన్‌ మహిళల విభాగంలో ఫైనల్‌ చేరింది. టోర్నీ మొత్తం అంచనాలకు మించి రాణించిన ఉక్రెయిన్‌ భామ స్వితోలినా మాత్రం తన కెరీర్‌లో ఆడుతున్న తొలి సెమీస్‌లో తడబడింది. మ్యాచ్‌ ఆసాంతం క్రాస్‌ కోర్టు, డౌన్‌ ద లైన్‌ షాట్‌లతో ప్రత్యర్థిని కోర్టు నలువైపులా పరుగెత్తించిన హలెప్‌ 73 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్‌ చేసిన హలెప్‌ 26 విన్నర్లను కొట్టగా.. స్వితోలినా ఒక సారి మాత్రమే బ్రేక్‌ చేసి కేవలం 10 విన్నర్లను కొట్టింది. ఫైనల్‌కు చేరే క్రమంలో హలెప్‌ కేవలం ఒకే ఒక్క సెట్‌ను ప్రత్యర్థికి కోల్పోవడం విశేషం.
నేటి పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌
జొకోవిచ్‌ X బాటిస్టా  
ఫెడరర్ఠ్‌ X నాదల్‌
సాయంత్రం 5.30 నుంచి స్టార్‌ స్పోర్ట్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement