జైపూర్‌కు ‘గౌతం సిటీ’ అని పేరు పెట్టాలి! | rename Jaipur to Gowtham city, twitter praises Gowtham | Sakshi
Sakshi News home page

Apr 23 2018 3:12 PM | Updated on Apr 23 2018 3:12 PM

rename Jaipur to Gowtham city, twitter praises Gowtham - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. హోరాహోరీ మ్యాచ్‌లు, ఊహించని ట్విస్టులు, అనూహ్య ఫలితాలతో రోజురోజుకు అభిమానులను అలరిస్తోంది. మొన్నటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు బలమైన బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌కు షాక్‌ ఇచ్చింది. కానీ, బెంగళూరును ఓడించిన ముంబై.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో చిత్తయింది. జైపూర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో రోహిత్‌ సేనను రాజస్థాన్‌ రాయల్స్‌ మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లో 33 పరుగులతో చెలరేగి ఆడి.. రాజస్థాన్‌కు అనూహ్య విజయాన్ని అందించిన కృష్ణప్ప గౌతంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 29 ఏళ్ల గౌతం ఆటతీరుకు ఫిదా అయిన నెటిజన్లు.. సోషల్‌ మీడియాలో అతన్ని ఆకాశానికెత్తుతున్నారు. స్టార్‌ స్పోర్ట్స్‌ తన ట్విటర్‌ పేజీలో గౌతమ్‌  కొనియాడుతూ.. ‘పింక్‌ గౌతం సిటీ’ అంటూ పేర్కొంది. దాంతో కనీసం ఒక్కరోజైనా జైపూర్‌ పేరును గౌతం సిటీగా మార్చాలని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘గోథం బ్యాట్‌మన్‌ (సూపర్‌హీరో సిరీస్‌)ను ఇస్తే.. గౌతం బ్యాట్స్‌మన్‌ను ఇచ్చాడు’ అని చమత్కరిస్తున్నారు. గౌతం సిటీలో అద్భుతమైన బ్యాట్‌మన్‌ ప్రతిభ చూశామని పేర్కొంటున్నారు.  

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌.. ముంబై ఇండియన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంజూ శాంసన్‌(52), బెన్‌స్టోక్స్‌ (40), కృష్ణప్ప గౌతమ్‌(33) పరుగులు చేశారు. ముంబై బౌలర్లో పాండ్యా, బుమ్రాలు చెరో రెండు వికెట్లు దక్కాయి. మెక్లెనగన్‌, క్రునాల్‌, ముస్తాఫిజుర్‌లు తలో వికెట్‌ నేలకూల్చారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(72), ఇషాన్‌ కిషన్‌ (58), పొలార్డ్‌(21)లు రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌కు 3, ధవల్‌ కులకర్ణికి 2, ఉనద్కత్‌కు ఒక్క వికెట్‌ లభించాయి. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్‌(4 ఓవర్లు 22 పరుగులకు 3 వికెట్లు)కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement