
లాహోర్: పాకిస్తాన్ ఆటగాళ్లు సరైన వయసును వెల్లడించాలని, తప్పుడు వయో ధ్రువీకరణతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పరువు తీయరాదని ఆ దేశ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కోరాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 16 ఏళ్ల నసీమ్ షా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతనిప్పుడు అండర్–19 ప్రపంచకప్ ఆడే జట్టుకు ఎంపికయ్యాడు. దీనిపై లతీఫ్ ట్విట్టర్‌లో స్పందించాడు. ‘పాక్ ఆటగాళ్లు అండర్–19 జట్టుకు ఆడతారు. అండర్–19 వాళ్లేమో అండర్–16లో ఆడతారు. అండర్–16 కుర్రాళ్లేమో అండర్–13 జట్టులో ఉంటారు. ఈ అండర్–13 పిల్లలు తల్లి ఒడిలో ఉంటారు. ఇదంతా ఓ ప్రహసనంలా మారింది. పీసీబీ దీనిపై ప్రధానంగా దృష్టి సారించి వయసు ధ్రువీకరణపై నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే బోర్డు నవ్వులపాలు కాకుండా ఉంటుంది’ అని ట్వీట్ చేశాడు.