‘భారత్‌ కంటే పాకిస్తాన్‌ ఎంతో సురక్షితం’

PCB Chairman Says We Have Proved That Pakistan Is Safe - Sakshi

హైదరాబాద్‌: స్వదేశంలో దశాబ్దం తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు సిరీస్‌ విజయవంతం కావడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు భారత్‌పై అక్కసు వెల్లగక్కాడు. భద్రతా పరంగా భారత్‌ కంటే పాకిస్తాన్‌ ఎంతో సురక్షితమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

‘శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌తో పాకిస్తాన్‌ సురక్షిత దేశమని నిరూపించాం. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే ఇక్కడికి(పాక్‌) రండి మా భద్రతా ఎలా ఉందో చూపిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మా పొరుగు దేశమైన భారత్‌ కంటే పాక్‌ ఎంతో సురక్షితమైన దేశం. మరి భారత్‌కు వెళ్లి క్రికెట్‌ ఆడటానికి లేని భయం పాక్‌ రావడానికి ఎందుకు? ఇక శ్రీలంక టెస్టు సిరీస్‌తో పాక్‌లో క్రికెట్‌ పునర్వైభవం సంతరించుకుంటదనే నమ్మకం ఉంది. శ్రీలంకను చూసి మిగతా దేశాలు కూడా పాక్‌ గడ్డపై క్రికెట్‌ ఆడటానికి రావాలి. 

ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరిస్‌ కోసం ఆ దేశ బోర్డుతో చర్చలు జరుపుతున్నాం. కేవలం బంగ్లాదేశ్‌తోనే కాదు అన్ని క్రికెట్‌ దేశాలు ఒక్కటి చెప్పదల్చుకున్నాం. ఇక నుంచి తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడబోం. ఎవరైనా మాతో సిరీస్‌ ఆడాలనుకుంటే పాక్‌ గడ్డపై అడుగుపెట్టాల్సిందే. ఇక శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ సక్సెస్‌ కావడానికి కృషి చేసిన అధికారులకు, క్రికెటర్లకు, మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు’అంటూ ఎహ్‌సాన్‌ మణి పేర్కొన్నాడు. 

ఇక భారత్‌పై మణి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీ సొంత డప్పు నువ్వు కొట్టుకోక పక్కనోడిపై పడి ఏడుస్తావెందుకు’అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా భారత్‌ అంతరంగిక విషయాల్లో పాక్‌ వేలు పెట్టాలని చూస్తే తాట తీస్తాం అని మరికొంత మంది ధ్వజమెత్తుతున్నారు. ఇక 2009లో శ్రీలంక క్రికెట్‌ జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ దేశ క్రికెట్‌ జట్టు కూడా పాక్‌ గడ్డపై అడుపెట్టని విషయం తెలిసిందే. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ శ్రీలంక జట్టుతోనే పాక్‌లో టెస్టు క్రికెట్‌ పునఃప్రారంభమైంది.  కాగా ఈ సిరీస్‌ను పాక్‌ 1-0తో కైవసం చేసుకుంది. 

చదవండి:
స్వదేశంలో గెలిచి...మురిసిన పాక్‌
‘మేం ఎక్కడికీ రాం.. మీరే ఇక్కడికి రావాలి’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top