పాక్‌కు పరుగుల పరీక్ష | Pakistan bowled to the West Indies in the first match with a poor performance in bowling | Sakshi
Sakshi News home page

పాక్‌కు పరుగుల పరీక్ష

Jun 3 2019 1:52 AM | Updated on Jun 3 2019 1:56 PM

 Pakistan bowled to the West Indies in the first match with a poor performance in bowling - Sakshi

నాటింగ్‌హామ్‌: బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌కు మరో కఠిన సవాల్‌. ఆ జట్టు సోమవారం టోర్నీ హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండ్‌ను ఢీకొననుంది. అసలే భీకర హిట్టింగ్‌తో చెలరేగుతున్న ఆతిథ్య జట్టును బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామమైన ట్రెంట్‌బ్రిడ్జ్‌ పిచ్‌పై నిలువరించడం పాక్‌కు పెద్ద పరీక్ష కానుంది. ఇంగ్లండ్‌ రెండు వన్డే అత్యధిక స్కోర్లు (481/6 ఆస్ట్రేలియాపై), (444/3 పాకిస్తాన్‌పై) ఇదే మైదానంలో నమోదు చేసినవి కావడం గమనార్హం. దీనికితోడు జోఫ్రా ఆర్చర్‌ రూపంలో మెరికలాంటి పేసర్‌ ఇప్పుడు ఆ జట్టు అమ్ములపొదిలో ఉన్నాడు.

ఈ పరిణామాల ప్రకారం అసాధారణంగా ఆడితేనే పాక్‌ విజయం సాధించే వీలుంటుంది. వారి ఆశలన్నీ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఫఖర్‌ జమాన్, ఇమాముల్‌ హక్, బాబర్‌ ఆజమ్‌పైనే ఉన్నాయి. ఫామ్‌ లేమితో కొట్టుమిట్టాడుతున్న కెప్టెన్‌ సర్ఫరాజ్‌పై ఇప్పటికే విమర్శల దాడి మొదలైంది. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే అవి తీవ్రం కావడం ఖాయం. విండీస్‌పై ఆకట్టుకున్న పేసర్‌ ఆమిర్‌తో పాటు హసన్‌ అలీ చెలరేగితే ప్రత్యర్థిని అడ్డుకోవడం సులువవుతుంది. ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా ఫామ్‌లోకి రావడంతో ఇంగ్లండ్‌ ఏ ఇబ్బందీ లేకుండా హాయిగా ఉంది. ఫిట్‌నెస్‌ సాధించిన పేసర్‌ మార్క్‌ వుడ్‌ను ఆడించే వీలుంది.  

ముఖాముఖి రికార్డు
ఇరు జట్లు ఇప్పటివరకు 87 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో 31 మ్యాచ్‌ల్లోనే పాకిస్తాన్‌ గెలిచింది. ఇంగ్లండ్‌ 53 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో 9 సార్లు ఎదురుపడగా చెరో నాలుగుసార్లు విజయం సాధించాయి. ఒకదాంట్లో ఫలితం రాలేదు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలవడం ద్వారానే పాక్‌ తమ ఏకైక ప్రపంచ కప్‌ (1992)ను సాధించడం విశేషం.

500 కొట్టేస్తారా...?
ప్రపంచ కప్‌ ప్రారంభం నుంచి వినిపిస్తున్న మాట ‘500’. వన్డేల్లో ఈ మార్క్‌ను తొలిసారిగా అందుకోగల సత్తా ఉన్న జట్టుగా అందరూ ఇంగ్లండ్‌కే ఓటేస్తున్నారు. మరీ ముఖ్యంగా కాస్త చిన్నదైన టెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలోనే ఈ రికార్డు నమోదవుతుందని అంచ నా వేస్తున్నారు. అది నేటి మ్యాచ్‌లోనే జరిగితే... ఇంగ్లండ్‌ మరింత దుర్బేధ్యం అవుతుంది. పాక్‌ ఆత్మవిశ్వాసంపై కోలుకోలేని దెబ్బ పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement