భారత యువ క్రికెటర్‌పై ఏడాది నిషేధం

One Year Ban For Under 19 World Cup Hero Manjot Kalra - Sakshi

తప్పుడు వయసు చూపించినందుకు ఢిల్లీ క్రికెట్‌ సంఘం చర్య

న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్లో సెంచరీతో భారత్‌ను గెలిపించిన ఓపెనర్‌ మన్‌జ్యోత్‌ కాల్రాపై... రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో ఆడకుండా ఢిల్లీ జిల్లా క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) ఏడాదిపాటు నిషేధం విధించింది. దేశవాళీ అండర్‌–16, అండర్‌–19 వయో విభాగాల్లో ఆడిన సమయంలో కాల్రా అసలు వయసుకంటే తక్కువ వయసు చూపి జట్లలోకి ఎంపికయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు తప్పని కాల్రా రుజువు చేయలేకపోయాడు. దాంతో కాల్రాపై ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్లు... రంజీ ట్రోఫీ ఆడకుండా ఏడాదిపాటు నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ (రిటైర్డ్‌) బదర్‌ దురెజ్‌ ప్రకటించారు.

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి రికార్డుల ప్రకారం మన్‌జ్యోత్‌ కాల్రా ప్రస్తుత వయస్సు 20 ఏళ్ల 351 రోజులుగా ఉంది. ఇటీవలే అండర్‌–23 క్రికెట్‌ టోర్నీలో బెంగాల్‌తో మ్యాచ్‌లో కాల్రా 80 పరుగులు చేశాడు. ఓపెనర్‌ ధావన్‌ లంకతో టి20 సిరీస్‌కు ఎంపిక కావడంతో అతని స్థానంలో కాల్రా ఢిల్లీ జట్టులోకి రావడం ఖాయమైంది. అయితే అంబుడ్స్‌మన్‌ తాజా నిర్ణయంతో కాల్రా ఎలాంటి క్రికెట్‌ ఆడే అవకాశం లేకుండా పోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top