
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్ (120; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒలీ పోప్ (135 నాటౌట్; 18 ఫోర్లు, సిక్స్) సెంచరీలతో కదం తొక్కారు. 224/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 152 ఓవర్లలో 499/9 వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.
రబడపై ఒక టెస్టు నిషేధం
దక్షిణాఫ్రికా పేసర్ రబడపై ఒక టెస్టు మ్యాచ్ నిషేధం విధించారు. తొలిరోజు ఆటలో జో రూట్‌ను క్లీన్»ౌల్డ్ చేసిన రబడ.. రూట్‌ను రెచ్చగొట్టే విధంగా గేలిచేస్తూ సంబరం చేసుకున్నాడు. ఇలా చేయడం ఐసీసీ ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. పైగా అతనికి ఈ రెండేళ్లలో ఇది నాలుగో డీ మెరిట్ కావడంతో నిబంధనల ప్రకారం ఓ టెస్టు నిషేధం పడింది.