ఏం చేసినా రాణించలేకపోయాను!

No shame if I fail after giving my all: Shikhar Dhawan - Sakshi

ఇంగ్లండ్‌లో వైఫల్యంపై ధావన్‌

దుబాయ్‌: ఆసియా కప్‌లో పరుగుల వరద పారిస్తున్న భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఇంగ్లండ్‌ టూర్‌ వైఫల్యంపై నోరు విప్పాడు. ఐతే అక్కడ విఫలమైనంత మాత్రాన సిగ్గుపడాల్సిన పని లేదన్నాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టుల్లో ఘోరంగా విఫలమవడంతో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో అతని ఎంపిక ప్రశ్నార్థకమైంది. అయితే తాజా దూకుడుతో మళ్లీ సెలక్షన్‌ ట్రాక్‌లో పడ్డాడు. ‘దేనికైనా ప్రదర్శనే కీలకం. అది బాగుంటే అన్ని కలిసొస్తాయి. ఇప్పటి ఫామ్‌తో టెస్టుల్లో స్థానం దక్కేదుంటే దక్కుతుంది. లేదంటే లేదు. రెడ్‌ బాల్‌తో ఆడినా... వైట్‌ బాల్‌తో ఆడినా... నాకున్న బ్యాటింగ్‌ పరిజ్ఞానంతో రాణిస్తాను’ అని డాషింగ్‌ ఓపెనర్‌ ధావన్‌ అన్నాడు. ఇంగ్లండ్‌ పర్యటన గురించే మాట్లాడితే... అక్కడ పూర్తిగా విఫలమయ్యానన్న సంగతి తనకు తెలుసన్నాడు. ‘నాకంటే సహచరులే బాగా ఆడారు. అంత మాత్రాన విపరీతంగా చింతించాల్సిన పనిలేదు. ఆసియా కప్‌లో వైట్‌ బాల్‌తో చక్కగా ఆడుతున్నా.

భిన్నమైన పరిస్థితుల్లో భిన్నమైన ప్రణాళికలతో ఆడతాం. కొన్నిసార్లు మన ప్రణాళికలు పనిచేస్తాయి. ఇంకొన్ని సార్లు చేయవు’ అని శిఖర్‌ వివరించాడు. ఆసియా కప్‌ గురించి మాట్లాడుతూ పాకిస్తాన్‌ బలమైన జట్టే అయినా బంగ్లాదేశ్‌ ఈ టోర్నీలో బాగా ఆడిందన్నాడు. ‘మేటి జట్లపై అద్భుతంగా ఆడిన బంగ్లాను అభినందించాల్సిందే. చెమటోడ్చి ఫైనల్‌ చేరడం గొప్పవిషయం. అయితే మేజర్‌ ఈవెంట్లలో టైటిల్‌ సాధించేందుకు ఇంకాస్త సమయం పట్టొచ్చు’ అని ఈ ఓపెనర్‌ అన్నాడు. విరాట్‌ కోహ్లి లేకపోవడంతో సీనియర్‌ ఓపెనర్లయిన తమపై అదనపు ఒత్తిడి ఉంటుందని తాను భావించడం లేదని శిఖర్‌ ధావన్‌ అన్నాడు. మిడిలార్డర్‌కు, మిగతా బ్యాట్స్‌మెన్‌కు అవకాశమివ్వాలని అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్నట్లు చెప్పాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top