వైరల్‌: ధోని షార్ట్‌ రన్‌.. కనిపెట్టని అంపైర్లు!

MS Dhoni Short Run in 2nd ODI Viral - Sakshi

అడిలైడ్‌ : ఫీల్డ్‌ అంపైర్ల అలసత్వం మరోసారి చర్చనీయాంశమైంది. టెక్నాలజీ యుగంలో కూడా అంపైర్లు పదేపదే తప్పు చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని వికెట్‌ విషయంలో పప్పులో కాలేసిన అంపైర్లు.. మంగళవారం జరిగిన రెండో వన్డేలో మరో తప్పిదం చేశారు. తొలి వన్డేలో చేసిన తప్పిదం భారత్‌ విజయవకాశాలను దెబ్బతీయగా.. రెండో వన్డేలో మాత్రం కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ, ధోని అద్భుత ఇన్నింగ్స్‌లు భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్‌ బౌలర్‌ నాథన్‌ లయన్‌ వేసిన 45వ ఓవర్‌లో ధోని షార్ట్‌ రన్‌ (పరుగు పూర్తి చేయకపోవడం) తీశాడు. దీన్ని అంపైర్లు గుర్తించలేదు. కనీసం ఆసీస్‌ ఆటగాళ్లు కూడా కనిపెట్టలేకపోయారు.

ఈ విషయాన్ని ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ బయటపెట్టడంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సిరీస్‌ అఫిషియల్‌ బ్రాడ్‌కాస్టర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గిల్‌క్రిస్ట్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. అంపైర్లు ధోని షార్ట్‌ రన్‌ను గుర్తిస్తే భారత్‌ గెలుపుపై ప్రభావం చూపేదని అభిప్రాయపడ్డాడు. ఇక బిగ్‌బాష్‌ లీగ్‌లో అంపైర్ తప్పిదంతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ డీఆర్సీ షార్ట్‌ సెంచరీ చేజారడం, మైకేల్‌ క్లింగర్‌ అనే మరో బ్యాట్స్‌మెన్‌ ఏడో బంతికి ఔటవ్వడం తెలిసిందే.

చదవండి : అంపైర్‌ తప్పిదమే కోహ్లిసేన కొంపముంచిందా? 

అంపైర్‌ తప్పిదం.. సెంచరీ మిస్

ఓవర్‌లో ఏడో బంతికి బ్యాట్స్‌మన్‌ ఔట్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top