అంపైర్‌ తప్పిదమే కోహ్లిసేన కొంపముంచిందా? 

Did India Lose For Umpire Mistake In Sydney ODI Against Australia - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియా పర్యటనలో 2-1తో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన కోహ్లిసేనకు మూడు వన్డేలసిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శనివారంలో సిడ్నీవేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 34 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. టెస్ట్‌ సిరీస్‌ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన టీమిండియా వన్డేల్లోనూ సులువుగా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆసీస్‌ బౌలర్‌ హీ రిచర్డ్సన్‌ (4/26) దాటికి భారత్‌ కీలక బ్యాట్స్‌మన్‌ క్యూ కట్టారు. ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ (133;129 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత శతకంతో పోరాడినప్పటికి ఇతర బ్యాట్స్‌మెన్‌ నుంచి సహకారం లభించకపోవడంతో భారత్‌కు అనుకూలంగా ఫలితం దక్కలేదు. 4 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను రోహిత్‌- ఎంఎస్‌ ధోని 137 పరుగుల అద్భుత భాగస్వామ్యంతో విజయం దిశగా నడిపించి ఆశలు రేకిత్తించారు.

ధోని వికెట్‌.. టర్నింగ్‌ పాయింట్‌
రోహిత్‌తో ఆచితూచి ఆడుతూ 93 బంతుల్లో అర్థసెంచరీ చేసిన ధోని.. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం భారత విజయ అవకాశాలపై తీవ్ర దెబ్బకొట్టింది. బెహ్రెన్‌డ్రాఫ్ బౌలింగ్‌లో బంతి అవుట్ సైడ్ పిచ్ అయినా.. అదేమీ పట్టించుకోకుండానే అంపైర్ మైకెల్ గవుఫ్ అవుటిచ్చాడు. టీమిండియా అప్పటికే ఉన్న ఒక్క రివ్యూను వృథా చేయడంతో.. మరోసారి డీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోయింది. హీ రిచర్డ్సన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిన అంబటి రాయుడు సమీక్షకు వెళ్లి వృథా చేశాడు. దీంతో భారత్ కీలకమైన ధోని వికెట్ కోల్పోయింది. డీఆర్ఎస్ కోరడంలో కింగ్ అయిన ధోనీ.. నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ వికెటే భారత విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ విషయాన్ని మ్యాచ్‌ అనంతరం ఆసీస్‌ బౌలర్‌ హీరిచర్డ్సన్‌ ప్రస్తావించాడు.  అదృష్టవశాత్తు ధోని వికెట్‌ లభించడంతోనే విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. అలాగే రోహిత్‌ శర్మ పోరాటంపై కూడా ప్రశంసలు కురిపించాడు.

మరోవైపు టీమిండియా కెప్టెన్‌ కోహ్లి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినా.. రోహిత్‌, ధోనిలు అద్భుతంగా ఆడి విజయంపై ఆశ కలిగించారని, కానీ దురదృష్టవశాత్తు ధోని వికెట్‌ కోల్పోవడం తమ గెలుపు అవకాశాలపై దెబ్బకొట్టిందని చెప్పుకొచ్చాడు. చేయాల్సిన రన్‌రేట్‌ ఎక్కవగా ఉండటం.. చివర్లో ఇతర బ్యాట్స్‌మెన్‌ నుంచి సహకారం లభించకపోవడం.. రోహిత్‌ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో ఔట్‌ అయ్యాడు. ఇంకొద్ది సేపు క్రీజులో ధోని ఉంటే భారత్‌కు విజయం దక్కేదని సోషల్‌ మీడియాలో అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top