
సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఫొటో
ధోని పెట్రోల్ బంక్‌లో కూర్చున్న ఓ ఫొటో ట్రెండ్ అయింది. ఇది నిజమే అనుకొని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు సైతం పప్పులో కాలేశారు..
సాక్షి, రాంచీ : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌కు హద్దు అదుపులేకుండా పోతుంది. ఆ మధ్య కేరళ వరద బాధితుల కోసం కెప్టెన్ కోహ్లి రూ. 82 కోట్లు.. రోనాల్డో 72 కోట్లు అంటూ ఫేక్ న్యూస్‌ను ట్రెండ్ చేశారు. ఇదే తరహాలో పెట్రో ధరలను నిరిసిస్తూ గత సోమవారం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పాల్గొన్నాడని ఓ వార్త వైరల్ అయింది. తన సతీమణి సాక్షి సింగ్, కొంతమంది సహచరులతో ధోని పెట్రోల్ బంక్‌లో కూర్చున్న ఓ ఫొటోను సాక్ష్యంగా చూపిస్తూ ఈ నకిలీ వార్తను ట్రెండ్ చేశారు. ఇది నిజమే అనుకొని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు సైతం పప్పులో కాలేశారు. ఈ ట్వీట్స్‌ను లైక్ చేస్తూ.. రీట్వీట్ కూడా చేశారు. అంతేకాకుండా పెరిగిన పెట్రోల్ ధరలను తాను భరించలేనని, అందుకే హెలిక్యాప్టర్ షాట్స్ ఆడభోనని ధోని వ్యాఖ్యనించినట్లు కూడా కొన్ని పోస్ట్‌లు పుట్టుకొచ్చాయి.
అయితే ఇవన్నీ ఫేక్ న్యూస్ అని ఆ ఫొటోలో ఉన్న ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవాని స్పష్టం చేశారు. ఆ ఫొటో సెప్టెంబర్ 10న తీసింది కాదని ఆగస్టు 29న సిమ్లాలో తీసిన ఫొటో అని నాటి పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. ధోని ఎలాంటి బంద్‌లో పాల్గొనలేదని, ఓ ప్రచార చిత్రం కోసం సిమ్లా వెళ్లినప్పుడు హిందుస్తాన్ పెట్రోలియం వారు తీసిన ఫొటో అని పేర్కొన్నారు.
Dhoni with Sakshi and friends during night shoot 😇 Picture Courtesy: @sapnabhavnani #Dhoni 🌃🌉🌌⛺😘 pic.twitter.com/vaU7PpYmA4
— #MSDhoni #MSDhoni MS Dhoni MS Dhoni (@iMSDhoniFC) August 30, 2018
ఆగస్టు నాటి ఫొటోను రీట్వీట్ చేసిన స్వప్నా భవాని