ద్రవిడ్‌ సలహాతోనే ఆ ఛాన్స్‌ 

Mayank Agarwal Says Rahul Dravids Guidance Kept Me Going - Sakshi

టీమిండియా క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌

న్యూఢిల్లీ :  ‘ఏం జరిగినా.. జరగబోతున్నా.. పరుగులు చేయడానికే కట్టుబడి ఉండు’ అని భారత్‌-ఏ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఇచ్చిన సలహాతోనే తను దేశవాళీ క్రికెట్‌లో రాణించానని భారత యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ తెలిపాడు. దీంతోనే వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికైనట్లు చెప్పుకొచ్చాడు. విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు 15 మంది జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌పై వేటు వేసిన సెలక్టర్లు కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశమిచ్చారు.

ఈ సందర్భంగా మయాంక్‌ హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘ భారత జట్టులో ఒక్కడినైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్యలో మేం చాలా క్రికెట్‌ ఆడాం. ఇదే మా ఆటమీద ఫోకస్‌ పెరిగేలా చేసింది. ఒక ఆటగాడిగా పరుగులు చేయడమే నా బాధ్యత. అంతే తప్ప ఇతర వ్యవహారాల గురించి నేను ఆలోచించను. నా ప్రదర్శను ఇలానే కొనసాగించడం.. ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేస్తూ మెరుగుపరుచుకోవడమే నాకు కావాలి. మాకు ఎప్పుడు సాయం అవరసరమైన ద్రవిడ్‌ అండగా నిలిచాడు. ఏం జరిగినా.. జరగబోతున్నా.. పరుగులు చేయడానికే కట్టుబడి ఉండని అతను చెప్పిన సలహాను పాటించాను. ఇది నాకెంతో ఉంపయోగపడింది. నేనెప్పుడు కష్టపడితే ఫలితం ఉంటుందని నమ్ముతాన’ని చెప్పుకొచ్చాడు.  

ఇక దేశవాళీతో పాటు భారత ‘ఎ’ జట్టు తరఫున టన్నుల కొద్దీ పరుగులు చేయడంతో అగర్వాల్‌ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. సమర్థుడైన ఓపెనర్‌ అయినప్పటికీ జట్టు పరిస్థితులరీత్యా అతడు ఇంతకాలం నిరీక్షించాల్సి వచ్చింది. అయితే, ధావన్, విజయ్‌ల వరుస వైఫల్యాల నేపథ్యంలో మయాంక్‌ అవకాశం వచ్చింది. తుది జట్టులో చోటు కోసం పృథ్వీ షాతో పోటీ ఉన్నా... అనుభవం రీత్యా అతడికే ముందుగా అవకాశం రావొచ్చు. అదే జరిగితే కర్ణాటక సహచరుడైన లోకేశ్‌ రాహుల్‌తో కలిసి మయాంక్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top