అప్పుడు గంగూలీనే కారణం: పాక్‌ మాజీ క్రికెటర్‌

Latif Says Ganguly Can Help Resume Bilateral Matches - Sakshi

కరాచీ: ప్రస్తుతం తమ క్రికెట్‌ జట్టు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డే(బీసీసీఐ) శరణ్యమని అంటున్నాడు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌. దీనికి బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చొరవ తీసుకోవాలని విన్నవించాడు. భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌తో తమ దేశంలో మళ్లీ ఆటకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్న లతీఫ్‌.. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని గంగూలీని కోరాడు. 2004లో పాకిస్తాన్‌లో టీమిండియా పర్యటించిందంటే అందుకు నాటి కెప్టెన్‌ గంగూలీయే కారణమన్న విషయాన్ని అతడు ఈ సందర్భంగా ప్రస్తావించాడు. తమ దేశంలో పర్యటించడానికి అప్పుడు బీసీసీఐ సుముఖత చూపకపోయినా గంగూలీ కారణంగానే భారత జట్టు.. పాక్‌లో పర్యటించిందన్నాడు.

ఇప్పుడు కూడా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో గంగూలీ శ్రద్ధ చూపాలన్నాడు. భారత్‌-పాక్‌ జట్ల క్రికెట్‌ మ్యాచ్‌ల పునరుద్ధరణకు ఓ క్రికెటర్‌గా, బీసీసీఐ చీఫ్‌గా పీసీబీ ప్రెసిడెంట్‌ ఎహ్‌సాన్‌ మణికి గంగూలీ సాయం చేస్తాడని తాను ఆశిస్తున్నానని తెలిపాడు. ‘భారత్‌-పాకిస్థాన్‌ నడుమ పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీ్‌సలు జరగనంతవరకు రెండు దేశాల మధ్య పరిస్థితులు మెరుగువపడవు. 2004లో పాకిస్థాన్‌లో భారత జట్టు పర్యటనకు బీసీసీఐ మొదట విముఖత ప్రదర్శించింది. కానీ అప్పటి కెప్టెన్‌ గంగూలీ బోర్డు, ఆటగాళ్లకు నచ్చజెప్పి పర్యటనకు ఒప్పించాడు. సుదీర్ఘకాలం తర్వాత జరిగిన ఆ టూర్‌లో భారత్‌ మరపురాని విజయాలు అందుకుంది’ అని మాజీ కీపర్‌ లతీఫ్‌ గుర్తుచేశాడు.ఆ సమయంలో పాకిస్తాన్‌లో పర్యటించిన భారత జట్టు అటు వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో గెలిచిన భారత్‌.. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.(ఇక్కడ చదవండి: మా తరంలో మ్యాచ్‌ విన్నర్‌ అతడే: దాదా)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top