
కోల్ కతా:భారత్ తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్ లోనూ శ్రీలంక పేసర్ సురంగా లక్మల్ విజృంభణ కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు సాధించి భారత్ ను కట్టడి చేసిన లక్మల్.. రెండో ఇన్నింగ్స్ లోనూ చెలరేగిపోతున్నాడు. 171/1 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఆఖరి రోజు ఆట ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాకిచ్చాడు లక్మల్.
తొలుత కేఎల్ రాహుల్(79;125 బంతుల్లో8 ఫోర్లు) ను అవుట్ చేసిన లక్మల్..కాసేపటికి చతేశ్వర పుజారా(22), అజింక్యా రహానే(0)లను వరసు బంతుల్లో అవుట్ చేశాడు. 21 పరుగుల వ్యవధిలో ముగ్గరు టాపార్డర్ ఆటగాళ్లను లక్మల్ అవుట్ చేసి లంక శిబిరంలో ఆనందం నింపాడు. 213 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను నష్టపోయిన భారత్..91 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇది చివరి రోజు ఆట కావడంతో మ్యాచ్ లో ఫలితం తేలే అవకాశాలు దాదాపు లేనట్లే.