అదే టర్నింగ్‌ పాయింట్‌: కోహ్లి

Kohli Reveals Turning Point Of 1st ODI After Suffering Loss - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 348 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించినా దాన్ని కాపాడుకోలేకపోయింది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లు విశేషంగా రాణించడంతో ఈ సిరీస్‌లో శుభారంభం చేశారు. భారత్‌తో టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన కివీస్‌.. ఈ తాజా విజయంతో కాస్త ఊరట పొందింది. కివీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ భుజం గాయం కారణంగా తొలి వన్డేకు సైతం దూరం కావడంతో ఆ బాధ్యతలను టామ్‌ లాథమ్‌ తీసుకున్నాడు. అయితే మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన లాథమ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. అదే విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. రాస్‌ టేలర్‌(109 నాటౌట్‌; 84 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడినా లాథమ్‌ ఇన్నింగ్సే మ్యాచ్‌ను తమ  నుంచి దూరం చేసిందని అన్నాడు.

మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో కోహ్లి మాట్లాడుతూ.. ‘ న్యూజిలాండ్‌ ఒక అద్భుతమైన ప్రదర్శన చేసింది. 348 పరుగుల టార్గెట్‌ను రక్షించుకుంటామనే అనుకున్నాం. అది భారీ లక్ష్యమే . మైదానంలో బంతితో  బరిలోకి దిగాక గెలుపుపై ధీమాగానే ఉన్నాం. కానీ టామ్‌ లాథమ్‌ ఇన్నింగ్స్‌ మా నుంచి మ్యాచ్‌ను దూరం చేసింది. అదే మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌ అని అనుకుంటున్నా. టేలర్‌, టామ్‌లు మిడిల్‌ ఓవర్లలో మాపై విరుచుకుపడ్డారు. వారిని నియంత్రించడం కష్టంగా మారింది. మేము ఫీల్డింగ్‌లో కూడా బాగానే ఆకట్టుకున్నాం. ఒక క్యాచ్‌ను జారవిడచడం తప్పితే మిగతా ఫీల్డింగ్‌ అంతా బాగుంది. ఓవరాల్‌గా ప్రత్యర్థి మాకంటే మెరుగ్గా ఆడింది. ఈ మ్యాచ్‌లో విజయానికి వారు అర్హలు’ అని కోహ్లి తెలిపాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ వన్డేల్లో తొలి శతకం సాధించడంపై కోహ్లి ప్రశంసించాడు. అయ్యర్‌ నుంచి మంచి ఇన్నింగ్స్‌ వచ్చిందని కొనియాడాడు. రాహుల్‌ మరొకసారి తన సత్తాను చాటాడని కోహ్లి ప్రశంసలు కురిపించాడు.(ఇక్కడ చదవండి: కోహ్లి ‘వీక్‌’ పాయింట్‌ అదేనా?)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top