రోహిత్‌ లేడు.. ఇక ఆ రికార్డు కోహ్లిదే!

Kohli One Run Away From Massive T20I World Record - Sakshi

గువాహటి: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఆదివారం ఇక్కడ శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను, మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ ఏడాది ఆరంభపు సిరీస్‌లో కూడా సత్తాచాటి శుభారంభం చేయాలని చూస్తోంది. కాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఒక రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన విరాట్‌ కోహ్లి.. అంతర్జాతీయ టీ20 పరుగుల్లో సహచర ఆటగాడు రోహిత్‌ శర్మతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు రోహిత్‌ను దాటేసే అవకాశం కోహ్లి ముందుంది.(ఇక్కడ చదవండి: తొలి పరీక్షకు సై!)

ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి-రోహిత్‌లు తలో 2,633 పరుగులు సాధించి టాప్‌లో కొనసాగుతున్నారు. రేపటి మ్యాచ్‌లో రోహిత్‌ను కోహ్లి అధిగమించడం దాదాపు ఖాయం. ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో కోహ్లి సింగిల్‌గా అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంటాడు. కేవలం పరుగు సాధిస్తే రోహిత్‌ను అధిగమించే కోహ్లి.. లంకేయులతో టీ20 సిరీస్‌లో పరుగుల వేట కొనసాగిస్తే మాత్రం హిట్‌ మ్యాన్‌కు అందనంత దూరంలో నిలుస్తాడు.విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో 50 బంతుల్లో 94 పరుగులు సాధించిన కోహ్లి.. ఇక మూడో టీ20లో 29 బంతుల్లో  అజేయంగా 70 పరుగులు సాధించాడు. దాంతో తాను మూడు ఫార్మాట్లకు సరిపోయే క్రికెటర్‌నని, అవసరమైతే తన హిట్టింగ్‌ ఇలా ఉంటుందంటూ విమర్శకుల నోళ్ల మూయించాడు. ఇదే ఫామ్‌ను శ్రీలంకతో జరుగనున్న పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌లో కూడా కొనసాగించాలని యోచిస్తున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top