క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌  | Kidambi Srikanth Reaches Quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 

Apr 5 2019 3:41 AM | Updated on Apr 5 2019 7:44 AM

Kidambi Srikanth Reaches Quarterfinals - Sakshi

కౌలాలంపూర్‌: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ –750 మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఒక్కడి పోరాటమే మిగిలింది. ఈ టోర్నీలో 8వ సీడ్‌గా బరిలోకి దిగిన అతను క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట కూడా నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ ప్లేయర్‌ శ్రీకాంత్‌ 21–11, 21–15తో థాయ్‌లాండ్‌కు చెందిన కోసిట్‌ ఫెట్‌ప్రదబ్‌ను వరుస గేముల్లో ఓడించాడు.

32 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత స్టార్‌ జోరుకు ఎదురులేకుండా పోయింది. థాయ్‌ ప్రత్యర్థిపై అతను అలవోక విజయం సాధించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌... ఒలింపిక్‌ చాంపియన్, నాలుగో సీడ్‌ చెన్‌ లాంగ్‌ (చైనా)ను ఎదుర్కొంటాడు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సింధు 18–21, 7–21తో çసుంగ్‌ జీ హ్యున్‌ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో 13–10తో ఆధిక్యంలో ఉన్న సింధు అనూహ్యంగా వెనుకబడింది. ఇక రెండో గేమ్‌లో ప్రత్యర్థి జోరుకు తలవంచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీ 21–15, 17–21, 13–21తో తన్‌ కియన్‌ మెంగ్‌– లై పై జింగ్‌ (మలేసియా) జంట చేతిలో ఓడింది.  

Advertisement
 
Advertisement
Advertisement