టైటిల్‌ వేటలో మెరిసిన రాహుల్‌, అగర్వాల్‌

Karnataka beat Tamil Nadu in Rain Marred Vijay Hazare Final - Sakshi

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీని కర్ణాటక జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక(వీజేడీ పద్ధతిలో) 60 పరుగుల తేడాతో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు 253 పరుగులు సాధించగా, అందుకు ధీటుగా బ్యాటింగ్‌ చేసింది కర్ణాటక. 23 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 146 పరుగులతో ఉన్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆపై ఫలితం కోసం వీజేడీ పద్ధతిని అవలంభించి కర్ణాటకను విజేతగా తేల్చారు. కర్ణాటక ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(52 నాటౌట్‌; 72 బంతుల్లో 5ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌(69 నాటౌట్‌; 55 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరిశారు. వీరిద్దరూ అజేయంగా 112 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి కర్ణాటకను పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ టోర్నీలో కేఎల్‌ రాహుల్‌ 598 పరుగులు సాధించాడు.  

భారత ఇంజనీర్‌ వి జయదేవన్‌ రూపొందించిన వీజేడీ పద్ధతిని మ్యాచ్‌ రద్దయిన పరిస్థితుల్లో ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా భారత్‌లో జరిగే దేశవాళీ టోర్నీలో వర్షం పడి మ్యాచ్‌ ఆగిపోతే ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. టాస్‌ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో అభినవ్‌ ముకుంద్‌- మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు అయితే మురళీ విజయ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరితే ముకుంద్‌(85) రాణించాడు. అటు తర్వాత బాబా అపరాజిత్‌(66), విజయ్‌ శంకర్‌(38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు  49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక పేసర్‌ అభిమన్యు మిథున్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగి తమిళనాడును దెబ్బకొట్టాడు. మొత్తంగా ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. కర్ణాటక బౌలర్లలు మిథున్‌ ఐదు వికెట్లకు జతగా, కౌశిక్‌ రెండు వికెట్లు సాధించాడు. ప్రతీక్‌ జైన్‌, కృష్ణప్ప గౌతమ్‌లకు తలో వికెట్‌ లభించింది. (ఇక్కడ చదవండి: హ్యాట్రిక్‌ వికెట్లతో ఇరగదీశాడు..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top