అదే వేదిక.. అంతే స్కోర్‌.. సీన్‌ రిపీట్‌ అవుతుందా?

Joe Root set South Africa a target of 438 to win the Cape Town Test - Sakshi

‘438’ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ నంబర్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రికెట్‌ అభిమానులకు ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫ్యాన్స్‌ మరిచిపోని నంబర్‌ ‘438’. ఎందుకంటే టీ20 ఫార్మట్‌ అంతగా ఎస్టాబ్లిష్‌ కాకముందే వన్డే చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో రికార్డు స్కోర్‌ నమోదు చేసింది దక్షిణాఫ్రికా జట్టు. కేప్‌టౌన్‌ వేదికగా ఆసీస్‌ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రొటీస్‌ జట్టు అందరినీ షాక్‌కు గురిచేస్తూ 438 పరుగులు సాధించి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదెప్పుడో 2006లో జరిగింది కదా మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆ చర్చ అనుకుంటున్నారా? అయితే అదే మ్యాజిక్‌ ఫిగర్‌ దక్షిణాఫ్రికాను మరోసారి ఊరిస్తోంది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా ‘438’ మరోసారి తెరపైకి వచ్చింది. 

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా ఆతిథ్య సఫారీ లక్ష్యం 438 పరుగులు. పర్యాటక ఇంగ్లండ్‌ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను 391/8 వద్ద డిక్లెర్డ్‌ చేసింది. దీంతో 46 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని డుప్లెసిస్‌ సేన ముందు ఇంగ్లండ్‌ 438 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఇక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటీస్‌ జట్టు రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.  ఎల్గర్‌(34), హమ్జా(15) అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం క్రీజులో మలాన్‌(63 బ్యాటింగ్‌), నైట్‌ వాచ్‌మన్‌ కేశవ్‌ మహారాజ్‌(2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. సఫారీ జట్టు గెలవాలంటే ఆట చివరి రోజు 312 పరుగులు సాధించాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. అయితే గెలుపు కోసం పోరాడటంతో పాటు ఓడిపోకుండా జాగ్రత్తగా ఆడాలని ప్రొటీస్‌ జట్టు భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో తప్పక గెలిచి నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో లెవల్‌ చేయాలని రూట్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. 

అయితే కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫికా ‘438’ సీన్‌ మరోసారి రిపీట్‌ చేస్తుందని ఆ దేశ అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఆనాటి మ్యాచ్‌కు సంబంధించి మధురస్మృతులను గుర్తుచేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆనాటి మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తున్నారు.  ఇక ఆ మ్యాచ్‌లో అప్పటి సారథి రికీ పాంటింగ్‌ (164) భారీ సెంచరీ సాధించడంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది. అనంతరం హెర్షల్‌ గిబ్స్‌(175), స్మిత్‌(90)తో పాటు బౌచర్‌(50 నాటౌట్‌) రాణించడంతో దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 438 పరుగులు సాధించి విజయాన్ని అందుకుని ఛేజింగ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top