మహిళల క్రికెట్ మారుతోంది

మహిళల క్రికెట్ మారుతోంది


సాక్షికి ప్రత్యేకం

- ఇంగ్లండ్‌పై టెస్టు విజయం అద్భుతం

- భారత మహిళా కెప్టెన్ మిథాలీరాజ్

సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల తర్వాత ఆడినా...జట్టులో ఎనిమిది మందికి తొలి మ్యాచే అయినా భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల బలమైన ఇంగ్లండ్‌ను ఏకైక టెస్టులో ఓడించి సంచలనం సృష్టించింది. ఈ విజయంలో కెప్టెన్‌గా హైదరాబాదీ మిథాలీరాజ్ కీలక పాత్ర పోషించింది. ఇంగ్లండ్ పర్యటన అనంతరం స్వస్థలం తిరిగొచ్చిన మిథాలీ... రాబోయే కొన్ని సంవత్సరాలకు సరిపడా స్ఫూర్తిని ఆ విజయం అందించిందంటోంది. భారత మహిళా క్రికెట్ భవిష్యత్తుపై కూడా ఆశాభావంతో ఉన్న కెప్టెన్ తన మనోగతం ‘సాక్షి’తో పంచుకుంది.



విశేషాలు ఆమె మాటల్లోనే...

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో విజయం: చాలా చాలా ఆనందంగా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే టెస్టుకు ముందు గెలుస్తామని నేను అనుకోలేదు. గట్టి పోటీ ఇచ్చినా చాలనుకున్నాం. అందుకే కొత్త అమ్మాయిలపై ఒత్తిడి పెంచలేదు. జట్టులో వారు ఎనిమిది మంది ఉన్నారు. కేవలం వంద శాతం కృషి చేయమనే చెప్పాను. నాకంటే వారికే ఈ విజయం విలువ ఎక్కువ.



తొలి టెస్టులోనే ఇలాంటి సంచలనం వారు జీవిత కాలం మరచిపోలేరు.  గెలిపించిన అంశాలు: అక్కడి పచ్చికపై టాస్ నెగ్గడం మాకు కలిసొచ్చింది. దానికి అనుగుణంగా ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగాం. మా బ్యాటింగ్ కూడా అలాగే సాగింది. అయితే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్  తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా పిచ్ మారిపోయింది. దాంతో గెలుపుపై నమ్మకం కలిగింది.

 

చివరి రోజు ఆట: చాలా టెన్షన్‌తో బ్యాటింగ్‌కు వెళ్లాను. లక్ష్యం చిన్నదే అయినా నేను అవుటైతే ఒక్కసారిగా మన జట్టు కుప్పకూలవచ్చు కూడా! ఆ సమయంలో ఇంగ్లండ్ కొత్త బంతి కూడా తీసుకోవాల్సి ఉంది. ఆ భయం నన్ను వెంటాడింది. అందుకే చాలా జాగ్రత్తగా ఆడాను. విజయానికి చేరువగా వచ్చినా తొందర పడలేదు. ఒక్క తప్పుడు షాట్ కూడా ఆడలేదు.

 

మహిళల టెస్టుల భవిష్యత్తు: మేం గెలిచిన వెంటనే బీసీసీఐ పెద్దలనుంచి అభినందన సందేశాలు చాలా వచ్చాయి. వారు కూడా మా విజయాన్ని గుర్తించారని, మహిళా క్రికెట్ మారుతోందని నమ్ముతున్నాం. టెస్టు మ్యాచ్‌ల సంగతి సరే... మేం 2007నుంచి దేశవాళీలో కూడా రెండు రోజుల మ్యాచ్‌లు ఆడలేదు. ఇవి రెగ్యులర్‌గా జరిగేతేనే నిలబడగలం. కాబట్టి ఇకపై రెండు రోజుల మ్యాచ్‌లను మహిళా క్రికెట్ ఆశిస్తోంది. వ్యక్తిగతంగా చూస్తే నేను కనీసం మరో 3-4 ఏళ్లు ఆడతాను. నా కెరీర్‌లో టెస్టుల సంఖ్య కనీసం రెండంకెలైనా (ఇప్పటికి 9 ఆడింది) ఉండాలని కోరుకుంటున్నా!

 

ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్ పరాజయం: కొంత బాధ పెట్టింది. టెస్టు ప్రదర్శనలో సగం స్థాయిలో రాణించినా వన్డేలూ గెలిచేవాళ్లం. రెండో వన్డేను చేతులారా పోగొట్టుకున్నాం. ఇకపై ప్రదర్శన మెరుగుపర్చుకోవాలి. ఇక కొత్త ఫార్మాట్ ప్రకారం ప్రపంచకప్‌కు ముందు ప్రతీ జట్టుతో ఆడే అవకాశం రావడం. కనీసం 21 మ్యాచ్‌లు లభించడం మంచి పరిణామం. దీని వల్ల మహిళా క్రికెట్‌లో ప్రమాణాలు పెరుగుతాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top