విజయం నేడా...రేపా..! 

India vs England: Kohli century leaves England facing big task win third test - Sakshi

మూడో టెస్టులో  గెలుపుపై భారత్‌ గురి 

ఇంగ్లండ్‌ లక్ష్యం 521

ప్రస్తుతం 23/0  

కోహ్లి మరో సెంచరీ   

అదే జోరు... అదే ఆధిపత్యం... మూడో టెస్టు మూడో రోజు కూడా భారత్‌ ప్రత్యర్థిని ఒక ఆటాడుకుంది. కోహ్లి చక్కటి సెంచరీకి తోడు పుజారా సహనం, చివర్లో పాండ్యా దూకుడు కలగలిపి టీమిండియా సోమవారం ఆటను శాసించింది. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోరు సాధించి ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని 521 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌కు నిర్దేశించింది. ఇక మిగిలిన రెండు రోజుల్లో మన బౌలర్లు ఎంత వేగంగా బ్యాట్స్‌మెన్‌ను పడగొడతారనేది చూడాలి. గెలుపు సంగతేమో కానీ కనీసం ‘డ్రా’ కోసమైనా ఇంగ్లండ్‌ రెండు పూర్తి రోజులు నిలబడటం కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్న స్థితిలో వాతావరణం ప్రతికూలంగా మారితే తప్ప కోహ్లి సేన గెలుపు లాంఛనమే కావచ్చు!   

నాటింగ్‌హామ్‌: ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆధిక్యాన్ని 2–1కి తగ్గించేందుకు భారత్‌ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. గెలుపు కోసం ఇంగ్లండ్‌ మరో 498 పరుగులు చేయాల్సి ఉంది! అంతకుముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. విరాట్‌ కోహ్లి (103; 10 ఫోర్లు) టెస్టుల్లో 23వ సెంచరీతో చెలరేగగా...  పుజారా (72; 9 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (52 బంతుల్లో 52 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు.  

కీలక భాగస్వామ్యాలు: ఓవర్‌నైట్‌ స్కోరు 124/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తొలి సెషన్‌లో చాలా జాగ్రత్తగా ఆడింది. ఇంగ్లండ్‌ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కోహ్లి, పుజారా వేగంగా ఆడే ప్రయత్నం చేయలేదు. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అండర్సన్‌ బౌలింగ్‌లో పుజారా  క్యాచ్‌ను స్లిప్‌లో బట్లర్‌ వదిలేయడం కూడా కలిసొచ్చింది. తొలి సెషన్‌లో భారత్‌ 29 ఓవర్లు ఆడి 70 పరుగులు చేయగలిగింది. లంచ్‌ తర్వాత వీరిద్దరి భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. ఈ దశలో పుజారాను ఔట్‌ చేసి స్టోక్స్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 

కోహ్లికి లైఫ్‌!: పుజారా వెనుదిరిగాక వచ్చిన రహానే కూడా కోహ్లికి చక్కటి సహకారం అందించాడు. టీ విరామానికి భారత్‌ స్కోరు 270 పరుగులకు చేరగా, మూడో సెషన్‌లో కూడా భారత్‌ తమ ఆటను కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ సెంచరీ కోల్పోయిన భారత కెప్టెన్‌కు రెండో ఇన్నింగ్స్‌లో అదృష్టం అండగా నిలిచింది. 93 పరుగుల వద్ద అండర్సన్‌ బౌలింగ్‌లో గల్లీలో నేరుగా చేతుల్లోకి వచ్చిన సునాయాస క్యాచ్‌ను జెన్నింగ్స్‌ వదిలేయగా... తర్వాతి బంతి మొదటి స్లిప్‌లో కుక్‌కు కాస్త ముందుగా పడింది. అయితే ఉత్కంఠకు తెర దించుతూ వోక్స్‌ వేసిన తర్వాతి ఓవర్‌ నాలుగో బంతిని కోహ్లి బౌండరీగా మలచి శతకం పూర్తి చేసుకున్నాడు. వోక్స్‌ తర్వాతి ఓవర్లోనే ఎల్బీగా దొరికిపోవడంతో విరాట్‌ ఆట ముగిసింది. పాండ్యా అర్ధ సెంచరీ పూర్తయిన కొద్ది సేపటికే భారత్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top