అమ్మాయిలూ అదరగొట్టారు

India stuns South Africa in low-scoring thriller wins series 3-0 - Sakshi

సఫారీని 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత మహిళల జట్టు

వడోదర: టెస్టుల్లో పురుషుల జట్టు దక్షిణాఫ్రికాను కంగుతినిపిస్తుంటే... వన్డేల్లో భారత మహిళల జట్టు కూడా సఫారీని చిత్తు చిత్తు చేస్తోంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీ బృందం 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. భారత్‌ చేతిలో దక్షిణాఫ్రికా వైట్‌వాష్‌ కావడం ఇదే మొదటిసారి. సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్‌ తక్కువ స్కోరునే కాపాడుకొని 6 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది.

టాపార్డర్‌ నుంచి టెయిలెండర్ల వరకు ఇద్దరు మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (76 బంతుల్లో 38; 5 ఫోర్లు), శిఖా పాండే (40 బంతుల్లో 35; 6 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. సఫారీ బౌలర్లలో మరిజన్నె కప్‌ 3, షబ్నమ్, అయబొంగ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 48 ఓవర్లలో 140 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత స్పిన్నర్లు ఏక్తా బిష్త్‌ 3, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌ చెరో 2 వికెట్లు తీశారు.

మిథాలీకి ‘వంద’నం...
తాజా గెలుపుతో హైదరాబాద్‌ క్రికెటర్, భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మరో ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 100 విజయాలు సాధించిన రెండో కెప్టెన్‌గా గుర్తింపు పొందింది. 20 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో మిథాలీ రాజ్‌ తన సారథ్యంలో భారత్‌కు వందో విజయాన్ని (వన్డేల్లో 80+టి20ల్లో 17+టెస్టుల్లో 3) అందించింది. చార్లోట్‌ ఎడ్వర్డ్స్‌ (142; ఇంగ్లండ్‌) మాత్రమే మిథాలీ కంటే ముందుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top