పాకిస్థాన్‌కు చెందిన ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు చాంపియన్స్ లీగ్ (సీఎల్‌టీ20) టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశాలు సన్నగిల్లాయి. భారత్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ లీగ్ టి20లో ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్న వోల్వ్స్ జట్టు ఆశలపై భారత ప్రభుత్వం నీళ్లు చల్లింది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు చాంపియన్స్ లీగ్ (సీఎల్‌టీ20) టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశాలు సన్నగిల్లాయి. భారత్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ లీగ్ టి20లో ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్న వోల్వ్స్ జట్టు ఆశలపై భారత ప్రభుత్వం నీళ్లు చల్లింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాక్ జట్టుకు వీసా ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించినట్లు తెలిసింది.
పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో వారి జట్టు పర్యటనకు భద్రతా చిక్కులు వస్తాయనే నెపంతో విదేశీ వ్యవహారాల శాఖ వీసా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. చివరి నిమిషంలో వీసా మంజూరైతే తప్ప... వోల్వ్స్ జట్టు టి20 టోర్నీలో ఆడే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. షెడ్యూలు ప్రకారమైతే క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో వోల్వ్స్ జట్టు ఈ నెల 17న ఒటాగో వోల్ట్స్‌తో తలపడాల్సి ఉంది. ఫైసలాబాద్ జట్టు గైర్హాజరీతో ఇప్పుడు క్వాలిఫయింగ్‌లో మూడు జట్లే తలపడనున్నాయి. దాయాది దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినడంతో గతంలోనూ పాక్ జట్టుకు అవకాశం కల్పించలేదు.